CM KCR review on non-agricultural property registrations : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఇవాళ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు, న్యాయ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తగిన మార్పులు చేసి ముందుకెళ్లాలా..? లేదంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలా..? అన్న దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
ఇక…తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత విధానంలోనే జరుగనునున్నాయి. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదును చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్లు సజావుగా, వేగవంతంగా జరిగేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ విధానంలో కాకుండా కార్డ్ విధానంలో జరుగనుంది. దీంతో ధరణి ద్వారా వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్ బుకింగ్ నిలిపివేశారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారికి నిర్ణయించిన తేదీల్లో యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.
నూతన విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను డిసెంబర్ 11న ప్రారంభించారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఏస్థాయిలో కూడా అవినీతికి ఆస్కారం లేకుండా 100 శాతం ఆన్‌లైన్ విధానంలో ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకునేలా నూతన విధానాన్ని కొలువుదీర్చారు.
ఈ నూతన విధానంలో ఇప్పటివరకు 2,599 స్లాట్స్ బుక్ అవగా వీటిలో 1,760 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.