దేశ ప్రజలు బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకున్నారు- సీఎం రేవంత్ రెడ్డి

సోనియా రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నామని, వైభవంగా వేడుకలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు గొప్ప పండుగ రోజు అని చెప్పారు.

Cm Revanth Reddy : దేశ ప్రజలు బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ మాటలు వినేందుకు దేశ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోడీకి పాకిస్తాన్ గుర్తు వస్తుందని సీఎం రేవంత్ మండిపడ్డారు.

”పాకిస్తాన్ ప్రధాని పుట్టినరోజు వేడుకలకు ఎవరూ వెళ్లరు. మోడీ ఇష్టం మేరకు వెళ్లి పాక్ ప్రధానిని కౌగిలించుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడం, రాజ్యాంగాన్ని మార్చడం అంశాలను లేవనెత్తితే బీజేపీకి పాకిస్తాన్ గుర్తు వస్తుంది. పదేళ్ల దేశ పురోగతి ప్రోగ్రస్ కార్డు బీజేపీ విడుదల చేయాలి. పదేళ్ల పాలనా వైఫల్యాలను కప్పించుకునేందుకు గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. దేశ ప్రధానిని, ప్రధాని కుర్చీని కాంగ్రెస్ ఎప్పుడూ అగౌరవ పరచలేదు. డిపాజిట్లు కూడా రాని చోట మెజారిటీ సీట్లు వస్తాయని బీజేపీ బీరాలు పలుకుతోంది. మోడీ గ్యారెంటీ వారంటీ ఖతమైంది” అని సీఎం రేవంత్ అన్నారు.

రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర ప్రజల తరఫున సోనియా గాంధీని ఆహ్వానించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు వచ్చేందుకు సోనియా గాంధీ సూత్రప్రాయంగా అంగీకరించారని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు గొప్ప పండుగ రోజు అని సీఎం రేవంత్ చెప్పారు.
సోనియా రాక కోసం మేమంతా ఎదురుచూస్తున్నామని, వైభవంగా వేడుకలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు