ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: అధికార మార్పిడి జరిగిన తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీల్లో ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు బయటపడిందని..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

ఫోన్ ట్యాపింగ్ కలకలంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చిందో చెప్పారు. దానిపై ఇప్పటి వరకు సీఎంగా తాను సమీక్ష జరపలేదని అన్నారు. అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని అన్నారు.

అధికార మార్పిడి జరిగిన తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీల్లో ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు బయటపడిందని తెలిపారు. వాటికి సంబంధించిన విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఎవరెవరు బాధ్యులో తేల్చే క్రమంలోనే ట్యాపింగ్ వ్యవహారం బయటికి వచ్చిందని అన్నారు.

ఆ తర్వాత కేసులో టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్లు జోడించి దర్యాప్తు కొనసాగిస్తున్నారని వివరించారు. అదృశ్యమైన హార్డ్ డిస్క్‌లు, ధ్వంసమైన డేటా బ్యాకప్ ఎక్కడ ఉందో విచారణ అధికారులే తేల్చాలని అన్నారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపడం లేదని, అటువంటి పనులు తాను చేయనని స్పష్టం చేశారు. అయితే, తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని అన్నారు.

వారి పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇలాంటి విషయాల్లో ఎవరిమాటా వినే వారు కాదని అన్నారు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు పై పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామని అన్నారు.

Also Read: ఈసీ అధికారులను కలిసి దీనిపై ఫిర్యాదు చేశాం: పేర్ని నాని, మేరుగు నాగార్జున