CM Revanth Reddy : స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఘటనపై కఠిన సభా చర్యలు తీసుకోవాలని కోరారు.

CM Revanth Reddy

  • ఇది సభా నాయకుడిగా మా అందరికి అవమానం
  • సభ్యుడి చేత రాజీనామా చేయించండి
  • సభ్యత్వం రద్దు చేయాలని శాసన మండలి చైర్మన్ కు విజ్ఞప్తి

CM Revanth Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ దుమారం నెలకొంది.

ఈ సందర్భంగా శాసనసభాపతిపై అనుచిత భాషలో వ్యాఖ్యలు చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. స్పీకర్ పదవిని అవమానించడం ఒక్క వ్యక్తిని కించపరచడం కాదని అది మొత్తం శాసనసభ గౌరవానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన అవమానమన్నారు.

ఇది తెలంగాణ చరిత్రలోనే చీకటి రోజుగా సీఎం అభివర్ణించారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడితో తక్షణమే రాజీనామా చేయించాలని, అవసరమైతే అతని పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా కోరారు.

శాసనసభలో జరిగిన ఈ ఘటనపై సీఎం తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. ‘‘స్పీకర్ స్థానం రాజ్యాంగబద్ధమైన అత్యున్నత స్థానం.. సీఎం నుంచి సాధారణ సభ్యుడి వరకు ప్రతి ఒక్కరూ ఆ పదవిని గౌరవించాల్సిందే..

Read Also : Bank of Baroda Recruitment : బరోడా బ్యాంకులో జాబ్స్ పడ్డాయ్.. డిగ్రీ పాసైతే చాలు.. నెలకు రూ.93,960 వరకు జీతం

స్పీకర్ మనసు గాయపడేలా, ఆయన కుటుంబాన్ని కించపరిచేలా మాట్లాడటం క్షమించరాని నేరం’’ అని వ్యాఖ్యానించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన సభాపతిని అవమానించిన అంశాన్ని తాను దళిత ప్రజాప్రతినిధులందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నానన్నారు.

బీఆర్ఎస్ దళితులకిచ్చిన మాట తప్పింది : 
బీఆర్ఎస్‌ దళిత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మాట తప్పారని, మూడెకరాల భూమి హామీని అమలు చేయలేదని రేవంత్ విమర్శించారు. తొలి ప్రభుత్వంలోనే దళిత ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారని, నేరెళ్ల ఘటనలో దళితులపై దాడులు జరిగాయని ప్రస్తావించారు.

ఇలాంటి ఘటనలు రాజకీయాలకు అతీతంగా ఖండించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం సంయమనం పాటిస్తే బలహీనతగా భావించవద్దన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరింపులతో ప్రభావితం చేయాలనుకుంటే సహించబోమని స్పష్టం చేశారు. సభలో చర్చ అనంతరమే నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

ఘటనపై కఠిన సభా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దుర్మార్గపు పోకడలను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఇలాంటివి కట్టడి చేయకపోతే సమాజం మనలను క్షమించరని, ఇలాంటి దుర్మార్గమైన తక్షణమే చర్యలు కట్టడి చేయాలన్నారు. ప్రతిపక్ష నేత పామ్ హౌస్‌లో ఉండి ప్రోత్సహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.