Cm Revanth Reddy : ఆదివాసీలపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు..

ఉచితంగా సోలార్ పంపు సెట్ తో పాటు ఇళ్లకు సోలార్ ద్వారా విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు.

Cm Revanth Reddy : ఆదివాసీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఆదివాసీ యోధుడు కొమురం భీమ్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. ఆదివాసీ సంఘాలు, నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

తమ ప్రాంతాల్లో రవాణ, సాగు, తాగునీటి సరఫరా, తమపై నమోదైన, నమోదవుతున్న కేసులు, విద్య, ఉద్యోగ, ఆర్థిక సమస్యలను ఆదివాసీ నాయకులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీ విద్యార్థుల విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దరఖాస్తు చేసుకున్న ఆదివాసీ విద్యార్థులందరికీ ఓవర్ షిప్ స్కాలర్ షిప్ మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

విద్యార్థులకు గోండు భాషలో ప్రాథమిక విద్యను బోధించడానికి అవసరమైన ప్రణాళికపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీ విద్యార్థులకు స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని, వారికి వసతి కల్పిస్తామని సీఎం తెలిపారు. ఆదివాసీలపై ఉద్యమాల సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Also Read : ఖాళీ అవుతున్న హైదరాబాద్ నగరం..!

రాజకీయపరంగా ఆదివాసీలకు అన్యాయం జరక్కుండా చూస్తామన్నారు. ఆదివాసీల ఆర్థిక అభివృద్ధికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల కోటా కింద ఇచ్చే ఇళ్లతో సంబంధం లేకుండా ఆదివాసీలకు సీఎం కోటా కింద ప్రత్యేకంగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారాయన. ఆదివాసీ రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు అందిస్తామన్నారు. ఇందిర జల ప్రభ కింద ఆదివాసీ రైతులందరికీ ఉచితంగా బోర్లు వేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు.

ఉచితంగా సోలార్ పంపు సెట్ తో పాటు ఇళ్లకు సోలార్ ద్వారా విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు. అలాగే ఆదివాసీ గూడెలలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేశ్లాపూర్ జాతరకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

 

 

Also Read : రైతు భరోసాలో అలా జరక్కూడదు..! కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..