Sankranti Festival Rush : పండక్కి పల్లె‎బాట పట్టిన సిటీ జనం, ఖాళీ అవుతున్న హైదరాబాద్ నగరం..!

రద్దీ ఎక్కువగా ఉండటంతో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు.

Sankranti Festival Rush : పండక్కి పల్లె‎బాట పట్టిన సిటీ జనం, ఖాళీ అవుతున్న హైదరాబాద్ నగరం..!

Updated On : January 10, 2025 / 11:34 PM IST

Sankranti Festival Rush : పట్టణ ప్రజలు పల్లెకు పయనం అయ్యారు. సంక్రాంతికి సిటీ ఊరు దారి పట్టింది. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానుండటంతో ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. అన్ని దారులు పల్లె వైపే వెళ్తున్నాయి. దీంతో ప్రధాన బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లడానికి ప్రజలు అర్థరాత్రి దాటినా ప్రయాణాలు సాగిస్తున్నారు.

ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు..
శని, ఆదివారాలతో పాటు సంక్రాంతి పండగ కలిసి రావడంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో బస్సుల కోసం జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరాంఘర్, ఎల్బీ నగర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి నుంచి వెళ్తున్నారు. ఇక సంక్రాంతి పండగ నేపథ్యంలో సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగలకు స్వస్థలాలకు వెళ్లడం కోసం కుటుంబసభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు.

ఎంజీబీఎస్ లో ఇసుకేస్తే రాలనంత జనం..
సంక్రాంతి పండక్కి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ లో రద్దీ నెలకొంది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. సొంతూళ్లకు వెళ్లేందుకు లక్షలాది మంది ప్రజలు ఎంజీబీఎస్ కు తరలివస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత జనంతో ఎంజీబీస్ నిండిపోయింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ వేలాది బస్సులను నడిపిస్తోంది.

6,432 ప్రత్యేక బస్సులు.. 50శాత టికెట్ రేట్లు పెంపు..
సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 6వేల 432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి జనవరి 17వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అలాగే 18, 19 తేదీలలో పల్లెల నుంచి పట్టణాలకు తిరిగి వచ్చేందుకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

అయితే, ప్రత్యేక బస్సుల పేరుతో సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటోంది ఆర్టీసీ. స్పెషల్ బస్సుల టికెట్లపై అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా 50శాతం టికెట్ రేట్లను పెంచింది. 2003 జీవో ప్రకారం 50శాతం టికెట్ రేట్లు పెంచినట్లు పేర్కొంది.

Also Read : రైతు భరోసాలో అలా జరక్కూడదు..! కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..