×
Ad

Cm Revanth Reddy: మేడారం ఆలయాభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. ఎన్ని కోట్లయినా మంజూరు.. మహా జాతరకు కేంద్రం నిధులివ్వాలి- సీఎం రేవంత్ రెడ్డి

రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయన్నారు. అందుకే సమ్మక్క సారలమ్మ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తామన్నారు.

Cm Revanth Reddy: మేడారం బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇది కేవలం ఒక బాధ్యత కాదు.. ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగం అని అన్నారు. ఆనాడు పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని సీఎం రేవంత్ ఆరోపించారు. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఆనాడు ఇక్కడి నుంచే నేను పాదయాత్ర మొదలుపెట్టానని గుర్తు చేశారు. ఫిబ్రవరి 6, 2023 న ఈ గడ్డపై నుంచి తెలంగాణకు పట్టిన చీడ, పీడను వదిలించేందుకు అడుగులు వేశామన్నారు.

ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు అని సీఎం రేవంత్ చెప్పారు. ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేస్తున్నామని వివరించారు. సమ్మక్క సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కకు, నాకు ఈ జన్మ ధన్యమైనట్లే అని సీఎం రేవంత్ అన్నారు. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.

ఆదివాసీలను, పూజారులను, సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామన్నారు. రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయన్నారు. అందుకే సమ్మక్క సారలమ్మ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తామన్నారు. మహా జాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తామన్నారు. పగలు, రాత్రి నిర్విరామంగా పనులు చేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. స్థానికుల భాగస్వామ్యం, సహకారం ఉంటేనే ఇది జరుగుతుందన్నారు.

సమ్మక్క సారక్క మాలధారణ చేసినట్లుగా భక్తితో పనులను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మహాజాతరకు మళ్లీ వస్తా… ఈసారి జాతరను గొప్పగా చేసుకుందాం అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. కుంభమేళాకు వేల కోట్లు ఇస్తున్న కేంద్రం.. ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం మహా జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ కోరారు.