CM Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తొలి ప్రాధాన్యత వారికేనన్న సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌కు కీలక సూచన

మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

CM Revanth Reddy

Indiramma Houses Scheme App Started: ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల అని అన్నారు. ఇల్లు, వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారు. అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్లు, భూ పంపిణీ పథకాలను ప్రారంభించారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల నమోదు చేయనున్నారని, ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Also Read: Ambati Rambabu: పుష్ప-2 సినిమాపై అంబటి రాంబాబు రివ్యూ.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమన్నారంటే?

మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని, నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే, పథకం లబ్ధిదారుల ఎంపికలో తొలి ప్రాధాన్యత దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఇవ్వటం జరుగుతుందని, గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతోంది. ఈ నెల 7, 8, 9 తేదీల్లో ప్రభుత్వ ఉత్సవాలు జరుగుతాయని, ఆ ఉత్సవాలకు విపక్ష నేతలను కూడా ఆహ్వానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్.. పోలీస్ స్టేష‌న్‌లో వీడియోలను షేర్ చేసిన మాజీమంత్రి

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రూ. కోట్లు ఖర్చుపెట్టి 33 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను కట్టుకున్నారు. పేదల ఇళ్ల సంగతిని మాత్రం గాలికొదిలేశారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 60 నుంచి 65వేల ఇళ్లే పూర్తయ్యాయి. ఫాంహౌస్ లు, పార్టీ ఆఫీస్ లపై పెట్టిన ఫోకస్ పేదల ఇళ్లపై పెట్టలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టింది. లక్షల కోట్ల అప్పులు చేయడమే కాకుండా సర్కార్ భూములను అమ్ముకున్నారని రేవంత్ అన్నారు.

ఈనెల 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలకు హాజరయ్యే విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వానికి విపక్షాలు సూచనలు ఇచ్చే సంప్రదాయం గతంలో ఉండేదని, ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు దెబ్బతీస్తున్నారని అన్నారు. పాలక, ప్రతిపక్షాలు శత్రుపక్షాలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. పాలక, ప్రతిపక్షాలు కలిస్తేనే ప్రభుత్వమని రేవంత్ చెప్పుకొచ్చారు. పెద్దమనిషిగా మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరై సూచనలు చేయాలని హితవు పలికారు. మాకేమీ బేషజాలు లేవు.. పాలక పక్షాన్ని ప్రశ్నించండి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి. అవసరమైన సూచనలు చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు.