×
Ad

Cm Revanth Reddy: విద్య మీ జీవితాలను మారుస్తుంది.. 25ఏళ్లు కష్టపడితే 75ఏళ్ల వరకు గౌరవంగా జీవించొచ్చు- సీఎం రేవంత్

ఈ సమాజంలో పోటీ పడాలంటే, అభివృద్ది చెందిన పౌరులుగా మీకు గుర్తింపు రావాలంటే మీరు విద్యలో రాణించాలి. అందుకే ఈరోజు మా ప్రభుత్వం విద్యనే ప్రధమ ప్రాధాన్యతగా తీసుకుని ముందుకెళ్తోంది.

Cm Revanth

  • మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్య మాత్రమే
  • మీకు గుర్తింపు రావాలంటే మీరు విద్యలో రాణించాలి
  • టెక్నాలజీ రంగంలో తెలంగాణను ముందుంచాలి

Cm Revanth Reddy: మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. 12వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ట్రిపుల్‌ ఐటీ (IIIT) భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులతో సీఎం రేవంత్‌ మాట్లాడారు.

ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ ఆవరణలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రజా ప్రభుత్వంలో ఇరిగేషన్, ఎడ్యుకేషన్ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి మన పాలమూరు బిడ్డే అని రేవంత్ అన్నారు. 75ఏళ్ల తర్వాత మన ప్రాంతానికి మళ్లీ సీఎం అవకాశం వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం పేదలకు ఇవ్వగలిగింది కేవలం విద్య మాత్రమే అని రేవంత్ చెప్పారు. విద్య వల్లే పేదల బతుకులు మారుతాయన్నారు. విద్యా ప్రమాణాలను పెంచడం, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు.

”ప్రతి గ్రామంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి పేదలకు పంపకాలు జరిగిపోయాయి. ఇప్పుడు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి భూములు కానీ ఆర్థిక లబ్ది ఆశించేకంటే మా ప్రభుత్వం ఇవ్వగలిగింది విద్యనే. విద్య ఒక్కటే మీ జీవితాలను మారుస్తుంది. విద్య ఒక్కటే మీ తల్లిదండ్రులను ఈ సమాజంలో ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా నిలుపుతుంది.

ఈ సమాజంలో పోటీ పడాలంటే, అభివృద్ది చెందిన పౌరులుగా మీకు గుర్తింపు రావాలంటే మీరు విద్యలో రాణించాలి. అందుకే ఈరోజు మా ప్రభుత్వం విద్యనే ప్రధమ ప్రాధాన్యతగా తీసుకుని ముందుకెళ్తోంది. విద్యకే నా టాప్ ప్రయారిటీ. ట్రిపుల్ ఐటీ మాత్రమే కాదు ఇంజినీరింగ్, లా కాలేజీలు కూడా మహబూబ్ నగర్ జిల్లాకు ఇవ్వడం జరిగింది” అని సీఎం రేవంత్ అన్నారు.

రాష్ట్రంలో రెండో ట్రిపుల్ ఐటీ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిర్మిస్తున్న అతి పెద్ద విద్యా సంస్థల్లో ఈ ట్రిపుల్ ఐటీ ఒకటి. నిర్మల్ జిల్లాలోని బాసర తర్వాత రాష్ట్రంలో ఏర్పాటవుతున్న రెండో ట్రిపుల్ ఐటీ ఇదే. సుమారు 600 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో దీన్ని నిర్మింనున్నారు. వెనుకబడిన పాలమూరు జిల్లాలో ఈ సంస్థను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలలో నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, టెక్నాలజీ రంగంలో తెలంగాణను ముందుంచాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

భారత తొలి ప్రధాని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు, విద్యకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. మా ప్రజా ప్రభుత్వం కూడా వాటికే టాప్ ప్రయారిటీ ఇస్తోంది. దశాబ్దాల క్రితం కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఇప్పటికీ జీవనాధారం అయ్యాయి. గతంలో భూస్వాములు, దొరల దగ్గర లక్షలాది ఎకరాలు ఉండేవి. భూగరిష్ఠ పరిమితి చట్టం తెచ్చి మిగులు భూములను పేదలకు పంచింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు పేదలకు పంచేందుకు ప్రభుత్వం దగ్గర భూమి లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం చేయగలిగింది మంచి విద్యను అందించటం మాత్రమే. విద్యతోనే మీ జీవితాలు మారుతాయి. మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి. 25 ఏళ్లు కష్టపడి చదివితే 75 ఏళ్ల వరకు గౌరవంగా జీవించొచ్చు” అని విద్యార్ధులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.