ఓఆర్ఆర్‌పై ‘గేట్ వే ఆఫ్ హైదరాబాద్’.. ప్రపంచంలోనే ఎత్తైన ఐకానిక్ టవర్.. రెండు నెలల్లో టెండర్లు పిలవాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు ..
హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని ప్రపంచస్థాయి ఆధునిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

Hyderabad
Telangana Govt: హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని ప్రపంచస్థాయి ఆధునిక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో మరో ఆర్థిక చక్రాన్ని సృష్టించేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనుంది. ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు స్పీడప్ చేయాలని, రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల్లో వేగం పెంచాలన్నారు. బహుళ ప్రయోజనాలతో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా గ్రేటర్ హైదరాబాద్‌కు ముఖద్వారంగా ఉన్న సరోవర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై గేట్ వే ఆఫ్ హైదరాబాద్ పేరిట ఐకానిక్ టవర్‌ను నిర్మించాలని అధికారులకు సూచించారు. ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు)కు ఒకవైపున ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి చేసి, మరోవైపు బాపూఘాట్ దిక్కున భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని, అందుకు తగిన డిజైన్లు రూపొందించాలని సూచించారు. బాపూఘాట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అందరినీ ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని చెప్పారు.
హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్డు నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్తగా ప్లైఓవర్ నిర్మించాలని, గాంధీ సరోవర్ చుట్టూ ఈ ప్లైఓవర్ కనెక్టివ్ కారిడార్ లా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అదేవిధంగా గాంధీ సరోవర్ వద్ద నిర్మించే ఐకానిక్ టవర్ ప్రపంచంలోనే ఎత్తయిన టవర్ గా ఉండాలని సీఎం సూచించారు. ఐకానిక్ టవర్ తదితర వాటికి డిజైన్లు రూపకల్పన చేసి రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనులు వేగవంతం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీళ్లను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలని, స్థలం వృథా కాకుండా మూసీ పరీవాహక ప్రాంతం ఇరువైపులా అండర్ గ్రౌండ్ లో వాటర్ స్టోరేజ్ సంప్ లు నిర్మించి అక్కడి నుంచి నీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.