Cm Revanth Reddy : మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్స్ జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నో స్థానంలో నిలిచారంటే..

ఈ సారి రిలీజ్ చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఐదుగురికి మాత్రమే చోటు దక్కింది.

Cm Revanth Reddy : మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్స్ జాబితాలో టాప్ 100 లిస్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి చోటు సంపాదించారు. తన పనితీరుతో గతంలో ఉన్న ర్యాంక్ ను మెరుగుపరుచుకున్నారు. తనదైన మార్క్ పాలన చూపిస్తూ ద ఇండియన్స్ ఎక్స్ ప్రెస్ 2025 సంవత్సరానికి రిలీజ్ చేసిన మోస్ట్ పవర్ ఫుల్ లిస్ట్ లో నిలిచారు. ఈ సారి రిలీజ్ చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఐదుగురికి మాత్రమే చోటు దక్కింది.

2025 సంవత్సరానికి గాను ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ అత్యంత శక్తివంతులైన 100 మంది ప్రముఖుల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానంలో నిలిచారు. గతేడాది విడుదల చేసిన జాబితాలో 38వ స్థానంలో ఉన్న ఆయన.. ఈసారి 10 ర్యాంకులు మెరుగుపడి 28వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

Also Read : తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణలో మళ్లీ కొత్త ట్విస్ట్‌లు.. ఏం జరిగిందంటే?

2021లో టీపీసీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత పార్టీలో అసంతృప్తిని ఎదుర్కోవడంతో పాటు వర్గపోరుతో కూడిన కాంగ్రెస్ పార్టీని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం వైపు నడిపించారని నివేదిక పేర్కొంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ను ఓడించి ఆ పార్టీకి షాక్ ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి బయటి వ్యక్తి అని కనిపించినప్పటికీ ఆ విమర్శలను అధిగమించి పార్టీని విజయం తీరంవైపు నడిపినట్లు ఈ నివేదిక తెలిపింది.

6 గ్యారెంటీల హామీ అమలు ముఖ్యమంత్రి రేవంత్ ముందున్న ప్రధానమైన సవాల్ అని స్పష్టం చేసింది. అలాగే యాక్టివ్ అవుతున్న బీజేపీని ఎదుర్కోవడం రేవంత్ కు మరో ఛాలెంజ్ అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవాల్సి ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఒక ప్రాంతీయ నాయకుడిగానే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా సీఎం రేవంత్ ను అభివర్ణించారు.

Also Read : అరెస్ట్ రివేంజ్‌ తప్పదా.. రేవంత్ ప్లాన్ అదేనా?

రైతు కుటుంబాలకు 21వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ప్రీమియం రిటైల్ స్టోర్లు వంటి వ్యాపార అవకాశాలను కల్పించడం, యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్ జెండర్ల నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదరణ పెరగడానికి కారణం అయ్యాయని రిపోర్ట్ తెలిపింది.

నియోజకవర్గాల పునర్ విభజనపై చెన్నై సదస్సులో సీఎం రేవంత్ వ్యక్తం చేసిన ధృడమైన అభిప్రాయాలు కూడా ఆయనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత దక్కేలా చేశాయి. భారతీయ అత్యంత శక్తిమంతులైన జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ కు చోటు దక్కడం భారత రాజకీయాల్లో కీలక మార్పునకు సంకేతం అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం అని వారు పేర్కొన్నారు.