CM Revanth Reddy
Hyderabad: చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సెల్లార్ తోపాటు ఫస్ట్ ఫ్లోర్ లో భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రమాద ప్రాంతాన్ని హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పొన్నంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుగురించి ఆరా తీశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పొన్నంకు సూచించారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ప్రమాద స్థలిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం. చాలా పెద్ద ప్రమాదం ఇది. ముత్యాలు అమ్మే షాప్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదని కిషన్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. సమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోలేదని అన్నారు. ఇది బాధాకరమైన విషయం అని, కేంద్రం తరపున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవటంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని, ఫైర్ టెక్నాలజీని మెరుగుపర్చుకోవాలని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.