Telangana Bullet Train : బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష.. అనంతగిరి, నల్లమలలో స్టేషన్ల ప్రతిపాదన.. అక్కడ రాణి రుద్రమ, రుద్రదేవుడి విగ్రహాలు
Telangana Bullet Train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, వరంగల్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.
- Harish Thanniru
- Updated on- June 17, 2026 / 12:19 PM IST
CM Revanth Reddy Reviews Bullet Train Project Stations
- బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
- అనంతగిరి, నల్లమలలో స్టేషన్ల ప్రతిపాదన..
- వరంగల్ ఎయిర్ పోర్టులో రాణి రుద్రమ, రుద్రదేవుడి విగ్రహాలు
Telangana Bullet Train : హైదరాబాద్–పుణె బుల్లెట్ ట్రైన్ మార్గంలో వికారాబాద్ సమీపంలోని అనంతగిరి వద్ద ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. అనంతగిరి నుంచి హైదరాబాద్ ఐటీ హబ్‌కు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు, వరంగల్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైల్వే కారిడార్‌లో ప్రతిపాదిత భారత్ ఫ్యూచర్ సిటీలో కూడా ఒక స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ మన్ననూర్ సమీపంలో నల్లమల స్టేషన్, సోమశిల ప్రాంతం వద్ద మరో స్టేషన్‌ను ప్రణాళికలో చేర్చాలని సీఎం సూచించారు. పర్యాటక ప్రాంతాలను అనుసంధానించే విధంగా బుల్లెట్ ట్రైన్ మార్గం ఉండాలని, శంషాబాద్‌ను బుల్లెట్ ట్రైన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.
వరంగల్ ఎయిర్‌పోర్టు డిజైన్లపై కూడా సీఎం అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణంలో కాకతీయుల వైభవం, తెలంగాణ వారసత్వ సంపద ప్రతిబింబించేలా రూపకల్పన చేయాలని సూచించారు. ఎయిర్‌పోర్టు ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద భారీ ఐలాండ్ ఏర్పాటు చేసి, అందులో రాణి రుద్రమదేవి, రుద్రదేవుడి విగ్రహాలతో పాటు భారీ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎయిర్‌పోర్టు డిజైన్ల తుది రూపకల్పన కోసం ఢిల్లీకి వెళ్లి సంబంధిత అధికారులతో చర్చలు జరపాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
