6 గ్యారెంటీలకు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పథకాల అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు

ప్రతీ గ్రామం, వార్డులో ప్రజాపాలన సభలను నిర్వహిస్తారు. ఈ సభలలో ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

6 Guarantees

6 గ్యారెంటీల అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు) అమలు చేస్తున్న ప్రభుత్వం మిగిలిన పథకాల అమలుకు లబ్దిదారుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకోసం ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు నిర్వహించనుంది సర్కార్.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు పెంచింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అభయహస్తం, ఆరు గ్యారెంటీల అమలుకు రంగం సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఈ నెల 28 నుంచి చేపట్టనున్న ప్రజాపాలన సభల ద్వారా లబ్దిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది ప్రభుత్వం. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10లక్షల బీమా అమలు చేస్తున్నారు. ఇప్పుడు అభయహస్తం కింద మిగిలిన పథకాలపై ఫోకస్ చేశార సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ నెల 28 నుంచి జనవరి 6వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

Also Read : లంచం ఎందుకు తీసుకోవాలో వివరించి చెప్పిన తహసీల్దారు.. మీరూ వింటారా?

ప్రతీ గ్రామం, వార్డులో ప్రజాపాలన సభలను నిర్వహిస్తారు. ఈ సభలలో ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాపాలనలో భాగంగా ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రతీ గ్రామం, వార్డుల్లో గ్రామ సభలు నిర్వహిస్తారు. ప్రతీ రోజు రెండు సభలను ఏర్పాటు చేయగా, మండల స్థాయి అధికారులు తహసీల్దార్, ఎంపీడీవో ఒక్కో సభ సారధ్యం బాధ్యత వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఒక సభను.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు మరో సభను నిర్వహిస్తారు. ఈ సభలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది.

ఈ సభల్లో ఆరు గ్యారెంటీల పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. అభయహస్తం సిక్స్ గ్యారెంటీలలో మహాలక్ష్మి, రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత పథకాలపై దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫొటో జత చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తుపత్రంతో పాటు ఆధార్, ఫోటో ఇస్తే సరిపోతుంది. గ్రామ సభల్లో మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడమే కాకుండా దరఖాస్తులు పూర్తి చేయలేని, చదువు రాని వారికి సహకరించాలని ఆశావర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలను ఆదేశించింది ప్రభుత్వం.

Also Read : కాంగ్రెస్‌కు చుక్కలు చూపేలా స్కెచ్ వేసిన బీఆర్‌ఎస్ పార్టీ..!

ఇక, ఈ గ్రామసభల పర్యవేక్షణకు ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారు. ఈ సభల నిర్వహణకు ఒక్కో సభకు 10వేల రూపాయల చొప్పున నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ప్రజాపాలన సభల పర్యవేక్షణ, అర్హుల ఎంపిక వంటి కార్యక్రమాలను ఇంఛార్జి మంత్రులు పర్యవేక్షిస్తారు. ఇందుకోసం 10 ఉమ్మడి జిల్లాలకు ఇంఛార్జి మంత్రులను నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి ఎంపిక చేస్తారు.