కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన.. కీలక విషయాలు వెల్లడి

ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతంగా ఉందని రేవంత్‌ రెడ్డి అన్నారు

CM Revanth Reddy

కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు. కులగణన సర్వే నివేదికను ఆయన సభలో ప్రవేశపెట్టి మాట్లాడారు. కుల సర్వే డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడతామని అన్నారు.

సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 మంది ఉన్నారని రేవంత్‌ రెడ్డి తెలిపారు. వారి శాతం 17.43గా ఉందని చెప్పారు. బీసీల జనాభా (ముస్లిం మైనార్టీ మినహా) 46.25 శాతంగా ఉన్నారని తెలిపారు. ముస్లిం మైనారిటీ బీసీలు సహా మొత్తం బీసీల సంఖ్య 56.33 శాతంగా ఉన్నారని వివరించారు.

Also Read: ట్రంప్‌ మరో సంచలనం.. మిలటరీ విమానంలో వలసదారులను భారత్‌కు పంపించేసిన అమెరికా

ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08 శాతంగా ఉందని అన్నారు. ఎస్టీల జనాభా 10.45 శాతంగా ఉందని అన్నారు. తెలంగాణలో మొత్తం ఓసీల జనాభా 15.79 శాతమని వివరించారు. ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతంగా ఉందని అన్నారు. ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం ఉందని తెలిపారు.

కులగణనలో ఎటువంటి పొరపాట్లు జరగలేదని రేవంత్‌ రెడ్డి చెప్పారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. తెలంగాణ సర్వే చేయడానికి ముందు దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారులు పర్యటించారన్నారు.

ఆయా రాష్ట్రాల్లోని సర్వేల్లోని లోతుపాట్లను సైతం గుర్తించి సరి చేశామని రేవంత్‌ రెడ్డి చెప్పారు. 12 సార్లు సమీక్ష నిర్వహించి, సర్వే చేశామని తెలిపారు. ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా గుర్తించి సర్వే చేశామని చెప్పారు. సర్వేలో పాల్గొన్న సిబ్బందికి చాలాసార్లు శిక్షణ ఇచ్చామని తెలిపారు.