ట్రంప్‌ మరో సంచలనం.. మిలటరీ విమానంలో వలసదారులను భారత్‌కు పంపించేసిన అమెరికా

ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి.

ట్రంప్‌ మరో సంచలనం.. మిలటరీ విమానంలో వలసదారులను భారత్‌కు పంపించేసిన అమెరికా

Updated On : February 6, 2025 / 5:06 PM IST

అమెరికా సైనిక రవాణా విమానంలో అక్రమ వలసదారులను ఎక్కించి భారత్‌కు పంపింది అగ్రరాజ్యం. భారత్‌ నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్లిన వారిలో కొందరు ఈ విమానంలో తిరిగి స్వదేశానికి వచ్చారు. భారత వలసదారులతో వచ్చిన తొలి విమానం ఇది.

అమెరికా అధ్యక్షుడిగా గత నెలలో డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులను తిరిగి పంపించేస్తామని ఎన్నికల వేళ ఆయన హామీలు ఇచ్చారు.

అందుకు తగ్గట్టుగానే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తిస్తున్న అధికారులు అటువంటి వారిని వారి స్వదేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు.

భారతదేశానికి చెందిన అక్రమ వలసదారులను తాజాగా మిలటరీ విమానం సీ17లో ఎక్కించి పంపించారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ట్రంప్‌ ఆదేశాలతో అధికారులు అక్రమవలసదారులను గుర్తించి, అనంతరం వారిని తరలించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

మొదట 538 మందిని అరెస్టు చేసి, వారి దేశాలకు పంపారు. పలు నగరాల్లో ఉన్న మరో 5 వేల మంది అక్రమ వలసదారులను వారి దేశాలకు తరలించనున్నారు. పలు దేశాల వారిని ఇప్పటికే అమెరికా కొన్ని విమానాల్లో పంపించింది. ఇందుకోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది.

మోదీని ట్రంప్‌ అమెరికాకు ఆహ్వానించారన్న వైట్‌హౌస్‌ ప్రతినిధి.. ఆ దేశానికి మోదీ ఎప్పుడు వెళ్తున్నారో తెలుసా?

ఎంత మందిని భారత్‌కు తరలించారన్న విషయంపై భారత అధికారుల నుంచి ఎటువంటి స్పందనా లేదు. అమెరికా తమ మిలటరి విమానంలో ఎంత మందిని తరలించిందన్న విషయంపై వివరాలు లేవు. అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధులు కూడా దీనిపై స్పందించడానికి ఒప్పుకోవట్లేదు. అయితే, సీ-17 హెవీ లిఫ్ట్ రవాణా విమానంలో దాదాపు 130 మంది పడతారు.

అమెరికార రాయబార అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా తన సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తోందని, ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తోందని చెప్పారు. అక్రమ వలసదారులను పంపిస్తోందని తెలిపారు. ఈ చర్యలు అక్రమవలసదారులకు స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని చెప్పారు.

కాగా, భారతీయులు సరైన దస్త్రాలు లేకుండా అమెరికాతో పాటు ఏ దేశంలో ఉన్నా వారిని తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ ఇప్పటికకే చెప్పింది. అమెరికాలో సరైన ధ్రువపత్రాలు లేకుని భారతీయులు దాదాపు 7,25,000 మంది ఉన్నట్లు తెలుస్తోంది.