Cm Revanth Reddy : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్ లో కూర్చుని మాట్లాడటం కాదు.. అసెంబ్లీకి రండి చర్చిద్దాం అని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు బంధు, రుణమాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని కేసీఆర్ కు చాలెంజ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కాంగ్రెస్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
రైతు బంధు, రుణమాఫీ విషయంలో చర్చకు రావాలి..
”కేసీఆర్ కాలం చెల్లిన రూ.1000 నోటు.. జేబులో ఉంటే జైలుకి వెళ్లాల్సిందే. ఫామ్ హౌస్ లో మాట్లాడటం కాదు, అసెంబ్లీకి రండి చర్చిద్దాం. రైతు బంధు, రుణమాఫీ విషయంలో చర్చకు రావాలి. మీలా మాట ఇచ్చి ఎగ్గొట్టే చరిత్ర నాది కాదు. బలంగా కొట్టడం కాదు కేసీఆర్.. ముందు సరిగా నిలబడు. కేసీఆర్ గుంభనంగా ఉండటం కాదు.. కేటీఆర్, హరీశ్ రావులను ఎగదోశారు.
విద్యపై చేసేది ఖర్చు కాదు పెట్టుబడి..
కేసీఆర్ కోసం ప్రజలెవరూ బాధపడటం లేదు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. గత పదేళ్ల పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయింది. యూనివర్సిటీలు ప్రాభవం కోల్పోయాయి. విద్యపై చేసేది ఖర్చు కాదు పెట్టుబడి. 20 ఏళ్లు టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేపట్టాం. సాంకేతిక నైపుణ్యంలో తెలంగాణ విద్యార్థులు పోటీపడేలా చర్యలు చేపట్టాం. సింగపూర్ ప్రభుత్వంతో టెక్నాలజీ ఎడ్యుకేషన్ విషయంలో ఒప్పందం చేసుకున్నాం.
Also Read : నేను కొడితే మామూలుగా ఉండదు..!- కార్యకర్తలతో కేసీఆర్ హాట్ కామెంట్స్
అసెంబ్లీకి రండి.. లెక్కలు చెబుతాం..
ఫామ్ హౌస్ లో ఉండి వచ్చినోళ్లకు సోధి చెప్పడం కాదు కేసీఆర్.. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతా. ఏ ఊరిలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేశానో సభలో పెడతా. ఎవరి ఖాతాలో ఎంత డబ్బు వేశానో నేను లెక్క చెబుతా. మీకు చిత్తశుద్ది, నిజాయితీ ఉంటే రండి అసెంబ్లీకి.. వచ్చి అడగండి” అని కేసీఆర్ కు సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఆ పెద్ద మనిషి మెదడు కూడా కోల్పోయినట్లు ఉన్నారు..
”దళితులకు మూడు ఎకరాలు అని ఎగ్గొట్టారు. దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని ఎగ్గొట్టారు. ఇలా చెప్పుకుంటూ వెళితే వంద మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర మీది.. పంగనామాలు పెట్టిన చరిత్ర మీది కేసీఆర్.. పదేళ్లు పరిపాలన చేసి ప్రజల వద్దకు వెళితే డిసెంబర్ లో అధికారం కోల్పోయారు. జూన్ లో డిపాజిట్లు కోల్పోయారు. ఇప్పుడు ఫామ్ హౌస్ లో పనుకుని ఆ పెద్ద మనిషి మెదడు కూడా కోల్పోయినట్లు ఉన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో గుడ్డు సున్నా ఇచ్చినా బుద్ధి మారలేదు. 14 నెలల నుంచి ఆయన ఫామ్ హౌస్ లో పడుకుని గంభీరంగా చూస్తున్నారట. ఎవరిని చూస్తున్నారు. రైతులకు రైతు భరోసా వచ్చింది, రుణమాఫీ జరిగింది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచాం. పేదలకు ఇళ్లలో 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ ది..
”అసెంబ్లీ ఎన్నికలను అడ్డు పెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్ ది. ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేశాం. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం రూ.18వేల కోట్లు మాత్రమే. ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం రూ.3వేల కోట్లు మాత్రమే. కానీ, మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.21 వేల కోట్లు రుణమాఫీ చేశాం.
మేం రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్ ఫామ్ హౌస్ కు వచ్చినోళ్లకు జోలి చెప్పుడం కాదు. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం. రైతుల జాబితాతో సహా మేం చేసిన రుణమాఫీ లెక్కలు చూపిస్తాం. చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి. మీలా.. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన చరిత్ర నాది కాదు. జహంగీర్ పీర్ దర్గాకు, వేములవాడ రాజన్నకు నిధులు ఇస్తానని మోసం చేశారు.
పాలమూరును ఎరవేసి ఎండబెట్టారు. మా ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ జరిగింది. రైతు భరోసా ఇస్తున్నాం. మార్చి 31 లోగా రూ.10 వేల కోట్లు రైతుభరోసా వేస్తాం. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తాం. మొదటి ఏడాదిలోనే 55142 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది.
నీ నాయకత్వంపై మీకు నమ్మకం ఉంటే అసెంబ్లీకి రండి..
మీ నాయకత్వంపై మీకు నమ్మకం ఉంటే అసెంబ్లీకి రండి. కొడితే బలంగా కొట్టడం సంగతి పక్కకు పెడితే సరిగ్గా నిలబడటం నేర్చుకోండి. ట్విట్టర్ లో ఈయనకు లైకులు ఎక్కువ వచ్చాయని చెప్పుకుంటున్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సోషల్ మీడియాలో లైకులు వచ్చాయని చెప్పుకుంటున్నారంటే ఆయన మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోండి.
కేసీఆర్.. ముందు మీ కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకోండి. బీసీ కులగణన, మాదిగ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నాం. దమ్ముంటే అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు ప్రజలతో బంధం తెగిపోయింది. కేసీఆర్ మమ్మల్ని అభినందించడానికి మీకు మనసు రాకపోతే ఫామ్ హౌస్ లోనే పడుకోండి” అని నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.