KCR : నేను కొడితే మామూలుగా ఉండదు..!- కార్యకర్తలతో కేసీఆర్ హాట్ కామెంట్స్
రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు.

KCR : రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఇక లాభం లేదు, ప్రత్యక్ష పోరాటం చేయాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఆయన అన్నారు. నమ్మి ఓట్లు వేస్తే గుణపాఠం చెప్పారని కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు. తులం బంగారం అన్నారు, వడ్డాణం అన్నారు.. నమ్మి ఓట్లు వేసి బావిలో పడ్డారని విరుచుకుపడ్డారు.
కరోనా టైమ్ లో కూడా నేను రైతుబంధు ఆపలేదు..
రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. కరోనా టైంలో కూడా నేను రైతుబంధు ఆపలేదన్నారు కేసీఆర్. రైతు బీమాతో ఎంతోమంది రైతులకు మేలు జరిగిందని ఆయన వెల్లడించారు.
పాలకులు ప్రాజెక్టులన్నీ ఎండబెడుతున్నారు..
గంభీరంగా, మౌనంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టటం నాకున్న అలవాటని అన్నారు. రాబోయే ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు కేసీఆర్. ఎక్కడి ప్రాజెక్ట్ లు అక్కడే పడుకున్నాయన్నారు. సంగమేశ్వరం, బసవేశ్వర, కాళేశ్వరం అన్నీ ఎండబెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు కేసీఆర్.
జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కేసీఅర్ సమావేశం..
ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో కేసీఅర్ సమావేశం అయ్యారు. కోహీర్, జహీరాబాద్, ఝారసంగం, మొగుడంపల్లి మండలాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.
Also Read : వావ్.. ఇది సాఫ్ట్ వేర్ కంపెనీ కాదు.. కొత్తగా కట్టే ఉస్మానియా ఆస్పత్రి.. దీని ప్రత్యేకతలు చూడండి…
ఝారసంగం నుండి 500మంది పాదయాత్రగా వచ్చారు. కేతికి సంగమేశ్వర స్వామి ప్రసాదం కేసీఆర్ కి అందించారు. ఈ కార్యక్రమంలో హరీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.