KTR
Telangana: తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారం ఒకవైపు.. నేషనల్ హెరాల్డ్ కేసు ఈడీ చార్జిషీట్‌లో రేవంత్ రెడ్డి పేరు వంటి అంశాలపై రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్‌రెడ్డి పేరు ఈడీ ఛార్జ్ షీట్‌లో చేరిస్తే.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఎందుకు నోరు విప్పడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. అధిష్ఠానానికి డబ్బులు ఇస్తూ తన పదవిని రేవంత్ కాపాడుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అవినీతి బయటపడకుండా కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే కాబట్టి.. ఆయన తప్పులపై బీజేపీ నాయకులు స్పందించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. తాజాగా కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
సిస్టర్ స్ట్రోక్‌తో కేటీఆర్‌కు చిన్న మెదడు చితికిపోయిందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంలో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని ప్రశ్నించారు. గ్లోబెల్స్ ప్రచారంలో నిన్ను మించిన వారు లేరు.. నీకు గ్లోబెల్ అవార్డు ఇవ్వాలి కేటీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తుంది. గోబెల్స్ ను కేటీఆర్ మించిపోయాడు. కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావొచ్చునని సీతక్క అన్నారు.
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదు. కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాదా..? మోడీ ప్రశంసల కోసమే ఈడీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేశారు. అబద్దాన్ని నిజం చేయడంకోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ మర్చిపోయారంటూ సీతక్క విమర్శించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై తప్పుడు విమర్శలు మానుకో కేటీఆర్ అంటూ హెచ్చరించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయం చేస్తే తప్పా..? గులాబీ కూలీల రూపంలో దోచుకున్న డబ్బు ఎక్కడదో కేటీఆర్ సమాధానం చెప్పాలని సీతక్క అన్నారు.
కేటిఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. ఇంట్లో వస్తున్న సమస్యలు పరిష్కరించుకోలేక ప్రస్టేషన్ తో మాట్లాడుతున్న కేటీఆర్ మాటలు ఎవరు పట్టించుకోరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ అక్రమంగా పెట్టిన కేసులు బూచిగా చూసుకొని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులు ఎలాంటివో దేశ ప్రజలకు తెలుసు. బీజేపీ నాయకుల కంటే ముందు కేటీఆర్ మాట్లాడటం చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి తొత్తుగా మారిందని నిలువెత్తు సాక్షంగా కనిపిస్తుందని అద్దంకి దయాకర్ ఆరోపించారు.
తెలంగాణను పిండి ఫిప్పి చేసి ప్రజల్ని మోసం చేసిన మీరు చెప్తే ఎవరు వింటారు కేటీఆర్.. ఫస్ట్ నీ ఇంట్లో నుండి బయటికి పోయి నిన్ను దొంగగా చిత్రీకరించిన నీ చెల్లె గురించి సమాధానం చెప్పు అంటూ అద్దంకి ప్రశ్నించారు. బీజేపీకి వకాల్తా పుచ్చుకునే కేటీఆర్ మాటలు ఎవరు నమ్మరు. రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్, బీజేపీ పెట్టిన కేసులను ఎదుర్కొనే దమ్ము సత్తా ఆయనకు ఉంది. తండ్రి, బావ కాళేశ్వరంలో, చెల్లి లిక్కర్ కేసులో పూర్తిగా కురుకున్నాక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కేటీఆర్ మాట్లాడుతున్నాడనేది తెలంగాణ సమాజానికి తెలుసు. రాజకీయంకోసం ఎవరిని మోసం చేస్తుండో కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మోదీ దగ్గర మొకరిల్లి బీజేపీ ఎత్తుగడలకు కేటీఆర్ చిత్తు అయ్యిండు.. బీజేపీ ఎజెండాను బీఆర్ఎస్ తీసుకొని ముందుకు పోతుందని అద్దంకి దయాకర్ విమర్శించారు.