కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను తనిఖీ చేయండి, ఆస్తుల వివరాలు బయటపెట్టండి- డీజీపీకి ఫిర్యాదు

ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిన ఆస్తుల వివరాలను కూడా బయటపెట్టాలని.. ఈ కేసును ఏసీబీ, ఈడీలతో దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు.

Kcr Farmhouse : తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీ రవిగుప్తాను కలిశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ను తనిఖీ చేయాలన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఓ వార్ రూమ్ ఉందని ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు బయటపడుతున్నాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిన ఆస్తుల వివరాలను కూడా బయటపెట్టాలని.. ఈ కేసును ఏసీబీ, ఈడీలతో దర్యాఫ్తు చేయించాలని కాంగ్రెస్ నేతలు బండి సుధాకర్, సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయల్లో దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో రోజుకొక కొత్త విషయం వెలుగుచూస్తోంది. పలువురు కాంగ్రెస్ నేతలు దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నారు. ప్రణీత్ రావు అరెస్ట్ తర్వాత తమ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు కొందరు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో వార్ రూమ్ ఏర్పాటు చేశారని, అక్కడి నుంచే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని కాంగ్రెస్ నేతలు బండి సుధాకర్, సమ్మిరెడ్డి ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో తనిఖీలు చేయాలని వారు డీజీపీని కోరారు. వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని చాలామందిని బెదిరింపులకు గురి చేశారని, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారని, కాబట్టి ఫామ్ హౌస్ లో తనిఖీలు చేయాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏసీబీ, ఈడీతో దీనిపై సమగ్ర విచారణ చేయించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ఈ వ్యవహారం అంతా నడిపించారని, ఆయన ఫామ్ హౌస్ లో సోదాలు జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.

Also Read : కేసీఆర్, కేటీఆర్ జైలుకే- ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎమ్మెల్యే యెన్నం సంచలన వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు