Congress six guarantees : కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై అందరి చూపు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల చట్టం ముసాయిదాపై సీఎం హోదాలో మొదటి సంతకం చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Congress six guarantees

Telangana Congress Government : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ‘మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి సారించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల చట్టం ముసాయిదాపై సీఎం హోదాలో మొదటి సంతకం చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఆరు గ్యారంటీల ముసాయిదాపైనే తొలి సంతకం 

కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ గృహ నిర్మాణం, గృహ జ్యోతి, యువ వికాసం, చేయూత పథకాల అమలుకు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో ప్రజలందరి చూపు వీటిపైనే ఉంది. ఈ ఆరు గ్యారంటీల అమలుకు ఏటా 70 వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమని అంచనా వేశారు. ఈ ఆరు గ్యారంటీలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదం తెలపాలని నిర్ణయించింది.

మహిళలకు వరం 

తెలంగాణలో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా 2,500 రూపాయలు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. తెలంగాణలో 1.20 కోట్లమంది గ్యాస్ వినియోగదారులున్నారు. వీరిలో అర్హులను గుర్తించి వారికి గ్యాస్ రాయితీ అందించనున్నారు. ఆరు గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరి చూపు వీటిపైనే ఉంది.

ఆసక్తికరంగా మారిన ఆరు గ్యారంటీలు

ఆరు గ్యారంటీ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే అంశంపై ప్రజలు ఆసక్తికరంగా ఉన్నారు. రైతు భరోసా పథకం కింద ఏటా రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరిపంటకు బోనస్ గా క్వింటాలుకు రూ.500 ఇవ్వాల్సి ఉంది. ఇందిరమ్మ గృహ నిర్మాణం కింద ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

ALSO READ : Telangana Congress Government : తెలంగాణలో కీలక అధికారుల మార్పునకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు

దీంతోపాటు గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, యువ వికాసం పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కారు చర్యలు ప్రారంభించింది. చేయూత పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాల బాధితులు, డయాలసిస్ పేషంట్లకు నెలకు రూ.4 వేలు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు.

ALSO READ : United States : యూఎస్ లాస్ వెగాస్‌ యూనివర్శిటీలో కాల్పులు…ముగ్గురి మృతి

పేదలకు రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ ఆరోగ్య బీమా కల్పించనుండటంతో అందరి చూపు ఆరు గ్యారంటీల అమలుపై ఉంది. గ్యాస్ రాయితీ పొందేందుకు వీలుగా ఈ పథకం అమలు చేశాకే గ్యాస్ బుక్ చేయాలని కొందరు నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు