కరోనా ఎఫెక్ట్ : తెలంగాణాలో వారికి మాత్రమే పూర్తి జీతం

కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై పడుతోంది. ఈ రాకాసి మూలంగా జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. లక్షల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడుతున్నారు. దీంతో ఆర్థిక రంగం కుదేలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం..దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటోంది. అయినా..కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. లాక్ డౌన్ క్రమంలో ప్రభుత్వ ఖజానాపై భారీగా ఎఫెక్ట్ పడింది.
ప్రజాప్రతినిధుల నుంచి మొదలుకుని..ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరుల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో వైద్యులు, పోలీసు సిబ్బంది కూడా ఉండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఎందుకంటే..వైరస్ వ్యాప్తి చెందకుండా..రోగులకు వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది ప్రాణాలకు తెగించి సహాయం చేస్తున్నరు.
వీరికి మార్చి నెలకు పూర్తి వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు శాఖలు (వైద్య, పోలీసు) ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహకం (ఇన్సెంటివ్) కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రోత్సాహకాన్ని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. 2020, ఏప్రిల్ 01వ తేదీ బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతాధికరులతో సుదీర్ఘంగా చర్చించారు. కరోనాకు పూర్తిగా అడ్డుకొనేందుకు మరింత వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే కొత్తగా మరిన్ని చికిత్స కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు.
* ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి గురించి సమగ్ర సమాచార నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
* ఇంకా 180 మంది ఆచూకీ తెలియకపోవడంపై సీఎం కేసీఆర్ అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం.
* వారి జాడ తెలుసుకొనేందుకు సెల్ ఫోన్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించాలన్నారు.
* చికిత్సలు అందించే వైద్య సిబ్బందికి, అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలన్నారు.
* ఎవరైనా దాడులకు పాల్పడితే… ఉపేక్షించరాదని సీఎం కేసీఆర్ సూచించారు.
Also Read | సీతారాముల కల్యాణం : భక్తులెవరూ రావద్దు..ప్రత్యక్ష ప్రసారంలో చూడండి