Cpi Veteran Suravaram Sudhakar Reddy
Suravaram Sudhakar Reddy: సీపీఐ దిగ్గజనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (83) భౌతికకాయాన్ని ఆయన బంధువులు గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించారు.
సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్యంతో కొన్నిరోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాలతో ఆయన అంతిమయాత్ర జరిగింది. గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. (Suravaram Sudhakar Reddy)
అనంతరం మఖ్దూం భవన్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర గాంధీ మెడికల్ కళాశాల వరకు జరిగింది. కామ్రేడ్ అమర్ రహే అంటూ వామపక్ష నేతలు నినాదాలు చేశారు.
గాంధీ ఆసుపత్రికి అంతిమయాత్ర చేరుకున్నాక సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించారు.
అంతకుముందు మఖ్దూం భవన్‌లో సురవరం సుధాకర్ రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించి మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత పేదలు, బడుగు బలహీన వర్గాలకు తీరని లోటని చెప్పారు.
తెలంగాణ మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు కూడా సురవరం భౌతికకాయానికి నివాళుర్పించారు. అలాగే, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు సురవరం భౌతిక కాయానికి నివాళుర్పించారు.
మరోవైపు, సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక ఖాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు.