Manjeera Dam: సంగారెడ్డి జిల్లాలో ఉన్న మంజీరా డ్యామ్ కు ప్రమాదం పొంచి ఉందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ ప్రకటించింది. బ్యారేజ్ లో నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని బృందం చెప్పింది. ప్రాజెక్ట్ దిగువ భాగంలో ఆప్రాన్ కొట్టుకుపోవడం వల్ల డ్యామ్ కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించే మంజీరా ప్రాజెక్టుకు ఈ వర్షా కాలంలో వరద ప్రవాహం పెరిగితే మరింత ప్రమాదం పొంచి ఉందంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకే కాకుండా ఆ చుట్టు పక్కల ప్రాంతంలో కొన్ని లక్షల మందికి నీటిని సరఫరా చేసే మంజీరా డ్యామ్ పూర్తి స్థాయిలో డేంజర్ జోన్ లో ఉందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నివేదిక సమర్పించింది. మేడిగడ్డ తరహాలో ఈ బ్యారేజీకి కూడా దిగువ భాగంలో కొట్టుకుపోయిన ఆఫ్రాన్ వల్ల ప్రమాదం ఉందంది. అదే విధంగా ఎక్కడికక్కడ పిల్లర్లలో పగుళ్లు వచ్చాయని సంస్థ తెలిపింది. కానీ, ఇప్పటివరకు మంజీరా డ్యామ్ నిర్వాహాకులు దీన్ని పట్టించుకోని పరిస్థితి ఉంది.
పిల్లర్లలో పగుళ్లు, ఆఫ్రాన్ కొట్టుకుపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు తుమ్మచెట్లు భారీగా పెరిగిపోవడంతో మరింత పరిశీలించడానికి తమకు అవకాశం లేకుండా పోయిందని డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. వరద ఉధృతికి కోతకు గురైన చోట ఎప్పటికప్పుడు రిపేర్లు చేయాలి. కానీ, అలా జరగలేదు. వెంటనే రిపేర్లు చేయాలని నివేదికలో చెప్పారు. ఉక్కు, కాంక్రీట్ తో కట్టి ఉంటే అంత ప్రమాదం ఉండేది కాదని.. అయితే, ఇది రాతి కట్టడం కావడంతో దీని నిర్వహణ ఎప్పటికప్పుడు ఉండాలని, అప్పుడే డ్యామ్ సేఫ్టీ ఉంటుందని తేల్చారు.
Also Read: ఆ నీళ్లు తాగొద్దు.. హైదరాబాద్ వాసులకు హైడ్రా హెచ్చరిక.. పీసీబీ నివేదికలో షాకింగ్ విషయాలు
గత ఏడాది వర్షాకాలంలో డ్యామ్ పూర్తిగా నిండిన సమయంలో గేట్లు తెరవాలని ఎంత ప్రయత్నం చేసినా గేట్లు తెరుచుకోలేదు. గేట్లన్నీ తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఏ గేట్ కూడా ఓపెన్ చేసే పరిస్థితి గతేడాది లేకుండా పోయింది. అంతా చూస్తుంటే.. కనీసం నిర్వహణ కూడా లేదన్న స్పష్టమవుతోందని డ్యామ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. బ్యారేజ్ ను పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పుణెలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో అధ్యయనం జరిపించాలని డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం సిఫార్సు చేసింది.
దాదాపు 47 సంవత్సరాల క్రితం మంజీరా నదిపై నిర్మించిన ఆనకట్టను మార్చి 22న రాష్ట్ర ఆనకట్ట భద్రతా సంస్థ (SDSO) పరిశీలించింది. ఆ బృందం నీటిపారుదల శాఖకు వివరణాత్మక నివేదికను సమర్పించింది. ఇందులో బహుళ భద్రతా సమస్యలు ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు ఎటువంటి పరిష్కార చర్యలు తీసుకోలేదని అధికారిక వర్గాలు నిర్ధారించాయి.
1.5 TMCft నిల్వ సామర్థ్యం కలిగిన మంజీర ప్రాజెక్ట్ ఒకప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కీలకమైన తాగునీటి వనరుగా ఉండేది. ఈ ప్రదేశం పర్యావరణ ప్రాముఖ్యతను కలిగి ఉంది. దాదాపు 300 పక్షి జాతులు, 700 కంటే ఎక్కువ ముగ్గర్ మొసళ్ళకు నిలయంగా వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించబడింది. ఒకప్పుడు కీలకమైన సంతానోత్పత్తి కేంద్రంగా ఉన్న ఇది ప్రస్తుతం తెలంగాణ మొట్టమొదటి రామ్‌సర్ చిత్తడి నేల ప్రదేశంగా పరిశీలనలో ఉంది.