మిస్ వరల్డ్ పోటీల రద్దుకు సంబంధించి ఆదేశాలు వచ్చాయా? సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏమన్నారు?
ఇతర జిల్లాల నుంచి కూడా ఫోర్స్‌ను తెప్పించామని తెలిపారు.

మిస్ వరల్డ్ ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ అన్నారు. 10 టీవీతో ఆయన మాట్లాడుతూ.. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో మిస్ వరల్డ్-2025 నిర్వహిస్తారా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీనిపై గజారావ్ భూపాల్ మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీల రద్దుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేశారు.
“ఇప్పటికే 80 శాతానికిపైగా అతిథులు, పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. వారికి కేటాయించిన హోటల్స్ వద్ద కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నాం. అతిథులు స్టే చేసే పరిసరాలను రెడ్ జోన్, గ్రీన్ జోన్ గా పెట్టాము.
అనుమతి లేకుండా ఎవరికీ లోపలకు అనుమతి ఉండదు. తెలంగాణలో చాలా ప్రదేశాలను అతిథులు విజిట్ చేస్తారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కోసం ఎలాంటి ట్రాఫిక్ డైవర్షన్ లు ఉండవు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతిథులను తీసుకెళతాం. సీఎం, గవర్నర్, మినిస్టర్స్, వీవీఐపీ, వీఐపీలకు ప్రొటోకాల్ ఉంటుంది.
ఇతర జిల్లాల నుంచి కూడా ఫోర్స్ ను తెప్పించాము. 31న మిస్ వరల్డ్ ఫైనల్ ఉండబోతుంది. దానికి అనుగుణంగా భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నాం” అని చెప్పారు.