IPL 2025: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ ఊపిరిపీల్చుకోండి.. మళ్లీ ఐపీఎల్‌ మ్యాచులు ప్రారంభమవుతాయి.. బీసీసీఐ ఏమందంటే?

రాబోయే రోజుల్లో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

IPL 2025: ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ ఊపిరిపీల్చుకోండి.. మళ్లీ ఐపీఎల్‌ మ్యాచులు ప్రారంభమవుతాయి.. బీసీసీఐ ఏమందంటే?

IPL 2025 Postponed for a Week

Updated On : May 9, 2025 / 4:55 PM IST

భారత్-పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐపీఎల్-2025ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మొదట బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇక ఐపీఎల్‌లోని మిగతా మ్యాచులు కొన్ని నెలల తర్వాతే జరుగుతాయని చాలా మంది భావించారు. అయితే, ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను వారం రోజుల పాటు మాత్రమే నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ మరో ప్రకటన చేసింది. దీంతో ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

భారత్ – పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సంబంధిత వర్గాలతో చర్చించి బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటోంది. బీసీసీఐ ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించి, వేదికల మార్పు సహా పలు ప్రతిపాదనలు పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ అధికారిక ప్రకటనలో ఏముంది?
“ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి, సంబంధిత ప్రభుత్వ, భద్రతా అధికారులతో చర్చించిన తర్వాతే కొత్త షెడ్యూల్, వేదికలపై తుది నిర్ణయం తీసుకుంటాం” అని బీసీసీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.

Also Read: 20 శాతం మేర లాభాల్లో డ్రోన్ స్టాక్స్‌.. ఎందుకంటే?

ప్రధాన ఫ్రాంచైజీలు, ఆటగాళ్ల భద్రత, స్పాన్సర్లు, లక్షలాది అభిమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుందని బీసీసీ చాలా స్పష్టంగా చెప్పింది. “భారత భద్రతా దళాలపై మాకు అపారమైన నమ్మకం ఉంది. అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఒక బాధ్యతాయుతమైన, సురక్షితమైన నిర్ణయం తీసుకోవడం మా కర్తవ్యం” అని బోర్డు పేర్కొంది.

ధర్మశాలలో మే 8న పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయిన విషయం తెలిసిందే. భారత్ సరిహద్దు ప్రాంతాలకు సమీపంలో మ్యాచ్‌లు ఆడటంపై విదేశీ ఆటగాళ్లలో భయాందోళనలు వ్యక్తమైనట్లు సమాచారం.

అత్యంత గోప్యంగా ఆటగాళ్ల తరలింపు
ధర్మశాలలో ఉన్న ఐపీఎల్ జట్లు, బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది, ఇతర లీగ్ సిబ్బందిని అత్యంత గోప్యంగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఢిల్లీకి తరలించినట్లు తెలుస్తోంది. వారిని బస్సుల్లో హోటళ్ల నుంచి తీసుకువస్తున్నప్పటికీ, తదుపరి ప్రయాణ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.

ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ మాట్లాడుతూ.. “పరిస్థితిని నిశితంగా సమీక్షిస్తున్నాం. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు రాలేదు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైతే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తదుపరి నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు.

ఇకపై ఏం జరగనుంది?
ప్రస్తుతం ఐపీఎల్ వారం రోజుల పాటు మాత్రమే వాయిదా పడినప్పటికీ, సరిహద్దుల్లో పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలు చక్కబడి, ఆటగాళ్లలో భరోసా కలిగితే తప్ప లీగ్ పునఃప్రారంభంపై స్పష్టత రాకపోవచ్చు. రాబోయే రోజుల్లో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.