Telangana Corona
Telangana Corona : అనేక రాష్ట్రాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. కరోనా రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. కానీ చాలా చోట్ల రోగులకు సరిపడ బెడ్లు ఉండడం లేదు. వెంటిలేటర్లు, ఐసీయూ వంటి సౌకర్యాలు లేక దయనీయ పరిస్థితుల్లో రోగులు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఇలాంటి పరిస్థితి లేదు. కానీ, వైరస్ తీవ్రత గమనిస్తే..రేపో, మాపో ఈ ముప్పు మనకూ ముంచుకొస్తుందోనని అర్థమవుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లతో బెడ్లు నిండిపోయాయి. బెడ్లు ఖాళీ లేక కొత్త పెషెంట్లను చేర్చుకునేందుకు చాలా ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే, ప్రతి ఒక్కరు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వైరస్ దరి చేరకుండా జాగ్రత్త పడాలని కోరుతున్నారు.
బెడ్లు సరిపోవడం లేదు:
తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. దీంతో కరోనా ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యా పెంచుతున్నారు. అయినా రోగుల సంఖ్యకు సరిపడ బెడ్లు ఉండటం లేదు. తెలంగాణలో మొత్తం 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ ఆసుపత్రిలో మొత్తం 350 కరోనా బెడ్లు ఉండగా, వాటిలో 240 పడకల్లో ఇప్పటికే కరోనా రోగులు ఉన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో 109 బెడ్లు ఉంటే, 102 బెడ్స్ ఫుల్ అయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో 1890 బెడ్లు ఉంటే 350 బెడ్స్ లో కరోనా రోగులు ఉన్నారు. టిమ్స్ లో 1261 బెడ్స్ ఉండగా, 432 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.
కరోనా రోగులతో కిటకిట:
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 8వేల 643 కరోనా బెడ్లు ఉండగా, వాటిలో 2వేల 408 బెడ్లు ఇప్పటికే నిండాయి. ఆక్సిజన్ సదుపాయం ఉన్న బెడ్స్ 5వేల 292 ఉండగా, 1034 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు. ఐసీయూ బెడ్లు 1709 ఉండగా, 432 మంది రోగులు ఉన్నారు. 244 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12వేల 973 కరోనా బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో 6వేల 159 బెడ్స్ కరోనా రోగులతో నిండాయి.