Fire Accident
Fire Accident: చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు, వృద్ధులు ఉన్నారు. ఘోర అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించారు. ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు.
అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉదయం 06:16 గంటలకు చార్మినార్‌లోని గుల్జార్ హౌస్ చౌరస్తాలోని G+2 భవనంలో మంటలు చెలరేగాయని సమాచారం వచ్చింది. మొఘల్‌పురా ఫైర్ సిబ్బంది అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. భవనం G+2 అంతస్తులను కలిగి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు పైఅంతస్తులకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లు ఒకేసారి జరిగాయి. మొదటి అంతస్తులో చిక్కుకున్న 17 మందిని అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
అగ్నిమాపక కేంద్రాల నుండి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించారు. మొత్తం 11 వాహనాలు, ఒక అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో, చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు. మంటలను ఆర్పడానికి మొత్తం రెండు గంటల సమయం పట్టిందని అగ్నిమాపక శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది.
మంటల్లో చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, మంటలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశారని, అడ్వాన్స్‌డ్ ఫైర్ రోబోట్, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను ఆపరేషన్లలో ఉపయోగించామని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనాకు రాలేదని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ పేర్కొంది.
మృతులు వీరే..
1. ప్రహ్లాద్ (70)
2. మున్నీ (70)
3. రాజేందర్ మోదీ (65)
4. సుమిత్ర (60)
5. హమేయ్(7)
6. అభిషేక్ (31)
7. శీతల్ (35)
8. ప్రియాంశ్ (4)
9. ఇరాజ్ (2)
10. ఆరుషి (3)
11. రిషభ్ (4)
12. ప్రథమ్ (ఏడాదిన్నర)
13. అనుయాన్ (3)
14. వర్ష (35)
15. పంకజ్ (36)
16. రజినీ (32)
17. ఇద్దు (4)
చనిపోయిన వారికి సంబంధించిన కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వారిలో చాలా మంది చుట్టాల ఇంటికి వచ్చినట్టు చెబుతున్నారు. గుల్జార్ హౌస్ బిల్డింగ్ లో ఓ వ్యాపారి నగల షాపు నడుపుతున్నారు. అతని ఇంటికి నాలుగు కుటుంబాలకు చెందిన చుట్టాలు వచ్చారు. వారంతా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. చనిపోయిన వారిలో బెంగాల్ కు చెందిన వారు కూడా ఉన్నారు.