Kadiyam Srihari: నాడు 36మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు.. ఒక్కరితోనూ కేసీఆర్ రాజీనామా చేయించలేదు.. ఫిరాయింపులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిపై ఎన్నో హామీలు ఇచ్చాను. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.

Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపులు, స్పీకర్ నోటీసులపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. నేను వ్యక్తిగతంగా ఫిరాయింపులను సమర్ధించను అని ఆయన తేల్చి చెప్పారు. అయితే, నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో సొంత అభిప్రాయాలు పక్కన పెట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. స్పీకర్ నోటీసులపైనా ఆయన రియాక్ట్ అయ్యారు. రిప్లయ్ కోసం స్పీకర్ నోటీస్ లో ఈ నెల చివరివరకు గడువు ఇచ్చారని తెలిపారు. నా సమాధానం స్పీకర్ ముందు ఉంచుతాను అన్నారు.

నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ కి తెలుపుతానన్నారు. ఎప్పుడైనా కడియం శ్రీహరి ఐకాన్ గానే ఉంటాడని వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరి రాజీనామాపై ఎవరి ఆశలు వాళ్లవని కామెంట్ చేశారు. నేను ఏం చేసినా.. కిక్కు ఉండేలా చూస్తానన్నారు. తాను పార్టీ మారి పదవులు అనుభవించలేదన్నారు. వచ్చిన పదవులను జిల్లా అభివృద్ధికి ఉపయోగించానని చెప్పారు.

తాను సెటిల్ మెంట్లు, కబ్జాలు, అక్రమాలు చేయలేదన్నారు. అక్రమాలు చేసి ఉంటే ఈ స్థాయికి వచ్చేవాడినే కాదన్నారు. నన్ను పిలిచి డిప్యూటీ సీఎం చేశారని ఆయన గుర్తు చేశారు. నా తెలివి, అనుభవం అవసరమని ఢిల్లీ నుండి కేసీఆర్ పిలిచారని అన్నారు. నేను ఎన్నడూ పాదాభివందనాలు చేయలేదన్నారు. నేను అమ్ముడుపోయే నాయకుడిని కాదని తేల్చి చెప్పారు.

”గతంలో 36 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. ఇద్దరిని మంత్రులను కూడా చేశారు. ఆ 36 మందిలో ఎవరూ రాజీనామా చేయలేదు. డిస్ క్వాలిఫై కాలేదు. కేసీఆర్ ను సూటిగా అడుగుతున్నా. ఆనాడు ఎందుకు రాజీనామాలు చేయించలేదు. మీరు చేస్తే సంసారమా.? సుప్రీంకోర్టుకు మీరు వెళ్ళారు. కోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోమని డైరెక్షన్ మాత్రమే ఇచ్చింది. నాకు స్పీకర్ నోటీస్ ముట్టింది. రిప్లయ్ ఇచ్చేందుకు నాకు ఇంకా సమయం ఉంది. స్పీకర్ నిర్ణయం ప్రకారం నడుచుకుంటాను. అభివృద్ధి ప్రధాన అంశంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను.

ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిపై ఎన్నో హామీలు ఇచ్చాను. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. నేను ఇచ్చిన హామీలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆందోళన చెందాను. సీఎం రేవంత్ స్టేషన్ ఘన్ పూర్ ప్రజల అభివృద్ధి కోసం నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నాపై నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. పదేళ్లుగా వెనుకబడ్డ ఘన్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతోంది” అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

Also Read: ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో ట్విస్ట్‌.. ఆ ఆరుగురికి స్పీకర్ నోటీసులు