MLAs Defection Issue: ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో ట్విస్ట్‌.. ఆ ఆరుగురికి స్పీకర్ నోటీసులు

MLAs Defection Issue: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.

MLAs Defection Issue: ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో ట్విస్ట్‌.. ఆ ఆరుగురికి స్పీకర్ నోటీసులు

MLAs Defection Issue

Updated On : September 19, 2025 / 9:26 AM IST

BRS MLAs : తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారణ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు భావిస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఫిర్యాదు దారులకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.

Also Read: Congress : కాంగ్రెస్ జూబ్లీహిల్స్ రేసుగుర్రం ఎవరు.?

ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల్), సంజయ్ కుమార్ (జగిత్యాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), కాలె యాదయ్య (చేవెళ్ల), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)లకు తాజాగా నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఫిర్యాయింపుల అభియోగాలకు సంబంధించి బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకూ స్పీకర్ నోటీసులు పంపించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా విజయం సాధించి కాంగ్రెస్ చేరారని.. వీరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కోర్టు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయగా.. 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావులు స్పీకర్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని తెలిపారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ ఈనెల 11న స్పీకర్ కార్యాలయం సంబంధిత ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు వేరువేరుగా లేఖలు పంపించింది.

పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానాలిచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల వివరణలపై తమ అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో అందజేయాలని, ఫిర్యాదు చేసిన సంబంధిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గురువారం శాసనసభ కార్యదర్శి లేఖలు పంపించారు. స్పీకర్ వద్ద విచారణలో భాగంగా నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు, ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలుంటాయి కాబట్టి తదుపరి విచారణ కోసం లీగల్ ఫార్మాట్ లో అభ్యంతరాలను ఇవ్వాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు.