Corona Increased
spread of corona has increased : తెలంగాణలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని తెలంగాణ డైరక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు అన్నారు. గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి పెరిగిందని తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కరోనా సెకండ్ వేవ్‌కు బలి కాక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం (ఏప్రిల్ 17, 2021) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క రోజే 1.25 లక్షల టెస్టులు చేశామని చెప్పారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38వేలకు పైగా బెడ్లను 53 వేలకు పెంచామని తెలిపారు. ఐదు కోవిడ్ డెడికేటెడ్ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. బెడ్ల విషయంలో ఎలాంటి కొరత లేదన్నారు. ఆక్సిజన్ కొరతలేదని చెప్పారు. 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేవని తెలిపారు.
మహారాష్ట్ర నుంచి వచ్చిన 20 మంది వ్యక్తులు తెలంగాణలోని సరిహద్దు జిల్లాలోకి ప్రవేశించి అక్కడ ఉత్సవం చేసుకున్నారని తెలిపారు. వీరిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా ప్రారంభమై వేగంగా వ్యాపించి చివరికి నాలుగు, ఐదు గ్రామాలకు సంబంధించిన 433 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్నారు. మార్చి 24 న ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు 12 రోజుల్లో ఐదుగా ఉన్న పాజిటివ్ కేసులు.. 433 కేసుల వరకు వెళ్లిందన్నారు.