Diwali crackers
Diwali : దీపావళి పండుగను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉదయం నుంచి చిన్నారులు, పెద్దలు టపాసులు కాల్చుతూ సందడి చేస్తున్నారు. సాయంత్రం వేళ పల్లెలు, పట్టణాలు టపాసుల మోతతో మారుమోగిపోనున్నాయి. అయితే, బాణాసంచా పేల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
టపాసులు కాల్చే సమయంలో మన అజాగ్రత్త కారణంగా పలు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ప్రతీయేటా టపాసులు పేల్చే సమయంలో చిన్నారులు ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారు. ఎక్కువగా కళ్లకు ప్రమాదాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. టపాసులు పేల్చే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కళ్లు పోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. దీంతో టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ కళ్లకు చిన్నపాటి ప్రమాదం ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై ఇక్కడ తెలుసుకోండి..
ఇలా చేయండి.
♦ పటాకులు కాల్చేప్పుడు కంటిలో ఏదైనా పడితే శుభ్రమైన నీరు, సెలైన్ ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి.
♦ వీలైనంత వరకు శుభ్రంగా, పొడిగాఉండే వస్త్రం కంటిపై కప్పాలి. గాయం పెద్దది కాకుండా ఉండాలంటే కంటిని మూసి ఉంచాలి. గాయపడిన కంటిపై ఒత్తిడి పెట్టకూడదు. తుడవడం, మర్దన చేయడం లాంటివి వద్దు, ఇది గాయాన్ని తీవ్రతరం చేస్తుంది.
♦ ఇంట్లో ఉన్న మెడిసిన్స్, ఆయిట్మెంట్స్, క్రీములు యూజ్ చేయొద్దు. గాయపడిన వ్యక్తిని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాలి.
♦ కంట్లో ఏదైనా పడితే దానిని తీయడానికి ప్రయత్నం చేయొద్దు.
♦ గాయపడిన వ్యక్తికి వైద్య సేవలు అవసరమైతే స్వయంగా వాహనం డ్రైవ్ చేయకుండా ఇతరుల సాయంతో హాస్పిటల్ కు వెళ్లాలి.
♦ పటాకులకు గ్యాస్ సిలిండర్లు, నూనె పదార్థాలకు దూరంగా ఉంచాలి. పటాకులు ఖాళీ ప్రదేశాల్లోనే కాల్చాలి.
♦ పటాకులు వెలిగించడానికి పొడవైన అగరబత్తులు ఉపయోగించాలి. దగ్గరలో రెండు బకెట్ల నీరు ఉంచుకోవాలి.
♦ తీవ్రమైన గాయాలైతే శుభ్రమైన బెడ్ షీట్ కప్పి ఆస్పత్రికి తీసుకు వెళ్లాలి.
♦ భారీ గాలులు వీచేప్పుడు కాల్చకుండా ఉంటేనే మంచిది.
♦ పటాకులు కాల్చేప్పుడు కళ్లద్దాలు పెట్టుకుంటే ప్రమాదాల నుంచి కండ్లను రక్షించుకునే అవకాశం ఉంటుంది.
♦ పటాకులు వెలిగించే స్థలం నుంచి కనీసం 5 మీటర్ల దూరం ఉండాలి.
♦ పిల్లలను ఒంటరిగా పటాకులు కాల్చనివ్వొద్దు.
♦ పటాకులు కాలిన తర్వాత గన్ పౌడర్ లేదా ఇతర కెమికల్స్ చేతుల్లో ఉంటాయి. ఇవి కళ్లలోకి వెళితే ప్రమాదం.. కళ్లకు తాకేముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
♦ కండ్లలో కెమికల్స్ పడితే చేతితో రుద్దకుండా ఆస్పత్రికి వెళ్లాలి.