Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో తాగునీటి కటకట.. సొంతంగా వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్న ఉద్యోగులు..
సచివాలయంలో తాగునీటి కష్టాలు ఎండా కాలం కాకముందే ఇలా ఉండటంతో వేసవి కాలంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలోనే మంచి నీటి కొరత ఏర్పడింది. తాగునీటి సరఫరా చేయాల్సిన కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో ఎండాకాలం రాకముందే కొన్ని డిపార్ట్ మెంట్స్ లో తాగునీటి సమస్య ఏర్పడింది. ఆయా విభాగాల్లో ఉద్యోగులు సొంతంగా వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తున్నారు. భోజన సమయం, టీ టైమ్ లో కూడా మంచి నీళ్లు లేకపోవడంతో కొంతమంది ఉద్యోగులు క్యాంటీన్ లో వాటర్ బాటిల్స్ కొంటున్నారు.
సచివాలయంలో వాటర్ సరఫరా చేసే కాంట్రాక్టర్లకు తాగునీటి బిల్లులను సైతం చెల్లించలేని స్థితికి ప్రభుత్వం దిగజారింది అనే విమర్శలు వస్తున్నాయి. నెల నెల బిల్లులు చెల్లించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ మూడు రోజులుగా నీటి సరఫరాను నిలిపివేశారు. వివిధ శాఖలకు సంబంధించి దాదాపు 20 లక్షల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లుల కోసం కాంట్రాక్టర్ ఎన్నిసార్లు సంబంధిత శాఖ అధికారులను సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి నీటి సరఫరా నిలిపివేశారు.
తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నస సిబ్బంది చివరకు ఇంటి నుంచి బాటిల్ తెచ్చుకుంటున్నారు. ఆయా శాఖల నుంచి డబ్బులు రావడం లేదని, వ్యక్తిగతంగా కొనుగోలు చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతి నెల 300 ఇస్తే తాగునీరు సరఫరా చేస్తామని చెప్పడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో తాగునీటి కష్టాలు ఎండా కాలం కాకముందే ఇలా ఉండటంతో వేసవి కాలంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: కేసీఆర్ ఫొటో లేకుండానే ప్రజల్లోకి వెళ్తున్నా.. ‘జాగృతి జనం బాట‘ పోస్టర్‌ను ఆవిష్కరించిన కవిత