×
Ad

TGSRTC Lucky Draw : బస్సెక్కితే బహుమతి.. టీజీఎస్ఆర్టీసీ దసరా లక్కీ డ్రా.. రూ.5.50 లక్షలు గెలుచుకునే చాన్స్..

TGSRTC Lucky Draw : దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది.

TGSRTC Lucky Draw

TGSRTC Lucky Draw : ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి లక్కీ డ్రా నిర్వహించనుంది. ఈ లక్కీడ్రాలో విజేతలకు బహుమతులు అందజేయనుంది.

Also Read: Telangana Govt : సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త పథకం

ఈనెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు టీజీఎస్ఆర్టీసీ ఈ లక్కీడ్రా నిర్వహిస్తోంది. ఆర్టీసీకి చెందిన హైఎండ్ బస్సులైన సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్, డీలక్స్, సూపర్ లగ్జరీ, లహారి నాన్ ఏసీతోపాటు అన్నిరకాల ఏసీ బస్సుల్లో ప్రయాణించిన వారే ఈ లక్కీ డ్రాకు అర్హులని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

ఈ సర్వీసుల్లో ప్రయాణించిన వారు తమ ప్రయాణం పూర్తయిన తరువాత టికెట్ పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబర్ రాసి బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలని సూచించింది. కేవలం ఈనెల 27వ తేదీ నుంచి 6వ తేదీ వరకు చేసిన ప్రయాణాలను మాత్రమే లక్కీ డ్రాకి సంస్థ పరిగణలోకి తీసుకుంటుందని స్పష్టం చేసింది.

రిజర్వేషన్ చేసుకొని ఆయా బస్సుల్లో ప్రయాణించినవారుసైతం లక్కీ డ్రాలో పాల్గొనవచ్చునని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్సులను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో అక్టోబర్ 8వ తేదీన లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేస్తారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేసి సంస్థ ఘనంగా సన్మానిస్తుందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.

ఈ లక్కీ డ్రాలో రీజియన్ కు ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువైన బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్ కు ప్రథమ బహుమతి రూ. 25వేలు, ద్వితీయ బహుమతి రూ.15వేలు, తృతీయ బహుమతి రూ.10వేలను సంస్థ ప్రకటించింది.

దసరా లక్కీ డ్రాలో ప్రయాణికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 తో పాటు స్థానిక డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.