Jubilee Hills Fake Votes: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫేక్ ఓట్ల కలకలంపై అధికారులు విచారణ జరిపారు. యూసుఫ్ గూడలోని ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీంతో యూసుఫ్ గూడ డివిజన్ 246 బూత్ ఓటర్ జాబితాపై గందరగోళంపై అధికారులు విచారణ జరిపారు. సంస్కృతి అవెన్యూకి వచ్చిన విచారణ జరిపిన ఎన్నికల అధికారులు అపార్ట్ మెంట్ కు ఒకే ఇంటి నెంబర్ ఉండటంతో అందరికీ సేమ్ డోర్ నెంబర్ వచ్చిందని తెలిపారు.
5 అంతస్తుల్లో అపార్ట్ మెంట్ ఉండగా అందులో 15 ప్లాట్స్ లో నివాసం ఉంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఓటర్ లిస్టులోనూ ఇవే పేర్లు ఉన్నాయి. ఎవరైనా చనిపోతే మాత్రమే ఓట్లను తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉపఎన్నికల సమయంలో ఓటర్ లిస్టులో భారీ మార్పులకు అవకాశం తక్కువ అని అధికారులు స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు తొలి రోజు 10 నామినేషన్ల దాఖలయ్యాయి. 10మంది అభ్యర్థుల 11 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఉపఎన్నికకు స్వతంత్ర అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ తొలి నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఒక అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. దీంతో 11 నామినేషన్ పత్రాలు వచ్చాయి. దీనికి సంబంధించిన సమాచారం రిటర్నింగ్ అధికారి సాయిరాం ప్రకటించారు. 19, 20వ తేదీలలో సెలవులు ఉంటాయని అప్పుడు నామినేషన్లు స్వీకరించము అని చెప్పారు.
21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 22న స్క్రూటీని ఉంటుందన్నారు. బోగస్ ఓట్ల అంశంపైనా రిటర్నింగ్ అధికారి స్పందించారు. దీనికి సంబంధించి ఎంక్వైరీ అధికారిగా యూసుఫ్ గూడ డిప్యూటీ కమిషనర్ ను పెట్టామన్నారు. ఆయన పూర్తి సమాచారాన్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి అందజేస్తారు. ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం మేరకు ఇవి గతం నుంచే ఉన్న ఓట్లు, ఇప్పుడు ఉప ఎన్నిక సందర్భంగా నమోదైన ఓట్లు కావు అనేది రిటర్నింగ్ ఆఫీసర్ చెబుతున్నారు. మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సాఫీగా సాగింది.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఏం చేస్తున్నాయంటే?