KTR Challenge Cm Revanth : దమ్ముంటే రాజీనామా చేయ్, అలా జరక్కపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా- సీఎం రేవంత్ కి కేటీఆర్ సవాల్

కొడంగల్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు.

KTR Challenge Cm Revanth : మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు కేటీఆర్. కొడంగల్ లో ఉప ఎన్నిక జరిగితే.. 50వేల ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి గెలవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

అంతేకాదు.. నరేందర్ రెడ్డి అలా గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కోస్గిలో నేను రైతు నిరసన దీక్షకి వెళ్తున్నానా లేక కొడంగల్ లో ఉపఎన్నిక వచ్చి రేవంత్ రెడ్డి ఓడిపోయి పట్నం నరేందర్ రెడ్డి గెలిచాక చేసే విజయోత్సవ ర్యాలీకి వచ్చానా అన్నట్టుగా ఉందన్నారు కేటీఆర్. కొడంగల్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు.

Also Read : చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజన్ పై దాడి.. రేవంత్ సర్కార్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

కొడంగల్ లో ఎవరు గెలుస్తారో చూద్దామా..
”రేవంత్ రెడ్డి మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మీరు అంటున్నారు కదా.. నేను కులగణన చేశా, బీసీలందరూ సంతోషంగా ఉన్నారు, రైతు బంధు వేశా రైతులంతా సంతోషంగా ఉన్నారు, రైతు కూలీలకు పైసలు వేశా వాళ్లు సంతోషంగా ఉన్నారు, ఇళ్ల కాగితాలు ఇచ్చా పేదలంతా సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు కదా.. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఇక్కడికి రండి. ఎవరు గెలుస్తారో చూద్దాం.

50వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం చేస్తా..
మీకు మాట ఇస్తున్నాం. ప్రచారానికి మేము ఇంతమంది రాము. మీరు భయపడొద్దు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లోనే కూర్చుంటాడు. బయటకు కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం. ఉప ఎన్నిక జరిగితే.. మేము గెలవడం కాదు.. 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తా. రాజకీయంలో కూడా ఉండను.

Also Read : కేసీఆర్ లెక్కలు ఐ ఫోన్.. రేవంత్ లెక్కలు చైనా ఫోన్..! బీసీ రిజర్వేషన్లు, రైతు రుణమాఫీపై ఎమ్మెల్సీ కవిత కీలక కామెంట్స్

ముఖ్యమంత్రి అన్నా, ప్రభుత్వం అన్నా ఎవరూ భయపడటం లేదు..
ఇది వాస్తవం. ఒక్క కొడంగల్ లోనే కాదు. రాష్ట్రం మొత్తంలో వాస్తవ ముఖచిత్రం ఇది. 420 హామీలు ఇచ్చి మళ్లీ మోసం చేస్తానంటే కుదరదు. ఇవాళ రైతులు అడుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గర్జిస్తున్నారు. ముఖ్యమంత్రి అన్న భయం లేదు, ప్రభుత్వం అన్న భయం లేదు. జనాలు ఘోరంగా తిడుతున్నారు” అంటూ రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్.

ఏడాదిగా కొడంగల్ లో కురుక్షేత్ర యుద్దం నడుస్తోంది..
”ఏడాది కాలంగా కొడంగల్ లో ఒక కురుక్ష్రేతం మాదిరిగా యుద్ధం నడుస్తోంది. మా ప్రాంతపు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం బాగు పడుతుందని మీరంతా ఓట్లు వేసి గెలిపించుకుంటే.. ఈ 14 నెలల్లో రేవంత్ రెడ్డి ఎవరి కోసం పని చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. 14 నెలల పరిపాలనలో ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు. ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు. ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు. ఒక్క పని యువత కోసం పని చేసింది లేదు.

అనుముల అన్నదమ్ముల కోసం, ఆయన అల్లుడి కోసం, అదానీ కోసం, బావమరుదుల కోసం, ఆయన కుటుంబసభ్యులకు వేల కోట్లు దోచుకోవడానికి, ఇక్కడి భూములు గుంజుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా పని చేస్తున్నారు” అని సీఎం రేవంత్ పై ధ్వజమెత్తారు కేటీఆర్.