కేసీఆర్ లెక్కలు ఐ ఫోన్.. రేవంత్ లెక్కలు చైనా ఫోన్..! బీసీ రిజర్వేషన్లు, రైతు రుణమాఫీపై ఎమ్మెల్సీ కవిత కీలక కామెంట్స్
ఎమ్మెల్సీ కవిత ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ సర్కార్ కూడా రాజకీయాలకు అతీతంగా

MLC Kavitha
MLC Kavitha: బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ సర్కార్ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని, ఆలయ అభివృద్ధికి పెద్దెత్తున నిధులు కేటాయించాలని కవిత కోరారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లు, రైతు రుణమాఫీపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దెలాగా చేసినా కార్యకర్తలు, నాయకులు మా వెంటనే ఉన్నారని కవిత అన్నారు. 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏవీ అమలు చేయలేదని విమర్శించారు. రైతుల పొలాలు ఎండిపోతున్నా పట్టించుకునే నాధుడు లేరని విమర్శించారు. రాజకీయ కక్షలతో కాకుండా కాళేశ్వరం ద్వారా వరద కాలువకు నీరు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని కవిత పేర్కొన్నారు. శిశుపాలుడు కూడా నూరు తప్పుల తరువాత శిక్షపడింది. రేపు కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే అవుతుందని అన్నారు.
కులగణనలో చెప్పిన 42శాతం బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. అన్ని కులాల వివరాలు వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు పెడతారో లేదో చెప్పాలి. రేవంత్ రెడ్డి లెక్కలు తప్పు.. కేసీఆర్ లెక్కలు ఐఫోన్ అయితే రేవంత్ రెడ్డి లెక్కలు చైనా ఫోన్ లాగ ఉన్నాయి అంటూ కవిత ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేసేదాకా ఉద్యమం చేస్తాం. జగిత్యాల గడ్డ నుంచే బీసీ ఉద్యమం మొదలు పెడతామని కవిత అన్నారు. రైతు రుణమాఫీపై మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ ఎక్కడకూడా సంపూర్ణంగా కాలేదు. బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ అడ్రస్సు లేకుండా పోతుంది అంటూ కవిత జోస్యం చెప్పారు.
Live: Addressing media at Jagtial https://t.co/AewuoFmT14
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 10, 2025