Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల గురించి బిగ్ అప్డేట్.. కొత్తది కావాలన్నా.. మార్పులు చేయాలన్నా..
కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తుల స్వీకరణ విషయంలో అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు.

Ration cards
New Ration Cards: కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తుల స్వీకరణ విషయంలో పౌరసరఫరాల శాఖ వ్యవహరించిన తీరు ఆశావహులను కొంత గందరగోళానికి గురిచేసింది. మీ సేవలో కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శనివారం మీ-సేవ కేంద్రాలకు కొత్తరేషన్ కార్డు దరఖాస్తుదారులు క్యూ కట్టారు. అయితే, అధికారులు కొద్దిగంటలకే మీ- సేవలో దరఖాస్తు చేసుకునే ఆప్షన్ ను తొలగించారు.
రేషన్ కార్డులకోసం కొత్త దరఖాస్తులను ఆన్ లైన్ లో స్వీకరించే పరిస్థితి లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా చేసే దరఖాస్తుల పరిశీలనలో సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరుగుతోందని, అందుకే కొత్త రేషన్ కార్డులకోసం మాన్యువల్ గానే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటికే కొందరు కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న ప్రజావాణిలోనూ దరఖాస్తు చేసుకున్నారని, వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారు వార్డు సభలు పెట్టే వరకు ఆగాలని సూచించారు. ఇదిలాఉంటే.. మార్పులు, చేర్పులు అయితే, మీ సేవాలో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
గ్రేటర్ పరిధిలో దాదాపు రెండున్నర లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. వారంతా వార్డు సభల్లో దరఖాస్తులు చేసుకోవచ్చునని, లేదంటే నేరుగా కార్యాలయాలకు వచ్చి కొత్త రేషన్ కార్డుల కోసం తమ దరఖాస్తులను అందజేయవచ్చునని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచించారు. ఇదిలాఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలుపెట్టి రేషన్ కార్డుల కోసం కొత్త దరఖాస్తులు తీసుకుంటుండగా గ్రేటర్ లో ఇంకా పాత దరఖాస్తులకు సంబంధించిన అర్హుల జాబితానే వెల్లడించలేదు. అయితే, ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ప్రక్రియను చేపడతామని తొలుత అధికారులు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు.
హైదరాబాద్ పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలో రేషన్ కార్డులకోసం ప్రజాపాలన ద్వారా 5.40లక్షల దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వీటిలో వార్డు సభలో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. దీనికితోడు జాబితాలో పేరురాని వారు, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు అక్కడే అప్లయ్ చేసుకోవచ్చు. దీంతో గ్రేటర్ లో వార్డుల వారిగా సభలు నిర్వహించి కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.