KTR : మూసీ నదిపై మాజీమంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన ధ్వజమెత్తారు. మూసీపై ముఖ్యమంత్రి రేవంత్ రోజుకో మాట చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజెంటేషన్ పేరుతో సీఎం రేవంత్ తన పరువు తీసుకున్నారని విమర్శించారు. చేయని సర్వేను చేసినట్లుగా రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పారని, మూసీ పేరుతో లక్షన్నర కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు కేటీఆర్. ఢిల్లీకి పంపే మూటల కోసమే మూసీపై రేవంత్ కు ప్రేమ ఉందన్నారు.
”మూసీ సుందరీకరణ అని మొదట అన్నదే సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళనకు రూ.లక్షన్నర కోట్లని అన్నది కూడా రేవంత్ రెడ్డి. మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్. మూసీ వల్ల ప్రమాదం జరగకుండా జంట జలాశయాలను నిర్మించారు. మూసీని మేము మురికి కూపంగా మార్చలేదు. మూసీని మురికి కూపంగా చేసిందే కాంగ్రెస్, టీడీపీ. 70శాతం పారిశ్రామిక వ్యర్థాలు మూసీలోనే కలుస్తున్నాయి.
మా హయాంలో మూసీ బ్యూటిఫికేషన్ చేయాలనుకున్నాం. మూసీలో గోదావరి నీటిని తరలించాలని ప్రయత్నించారు. నల్గొండ జిల్లాకు శుద్ధమైన నీటిని అందించాలనుకున్నాం. రూ.10వేల కోట్లతో ఎక్స్ ప్రెస్ వే నిర్మించాలని ప్లాన్ చేశాం. మూసీ అభివృద్ది కోసం రూ.16 వేల 634 కోట్లకు డీపీఆర్ సిద్ధం చేశాం. కాంగ్రెస్ లా కాకుండా మూసీ ప్రాజెక్ట్ ను మానవీయ కోణంలో చేపట్టాలనుకున్నాం.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశాం. మూసీపై 15 బ్రిడ్జిలను కూడా మంజూరు చేశాం. పొద్దున లేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరం నీటిని గండిపేట్ కు తరలించేందుకు రూ.1100 కోట్లు కేటాయించాం. సీఎంలాగా నల్గొండ జిల్లా నేతలు అజ్ఞానంతో మాట్లాడకండి. 31 ఎస్టీపీల నిర్మాణానికి చర్యలు చేపట్టాం. 31 ఎస్టీపీలు పూర్తైతే నల్గొండ జిల్లాకు స్వచ్చమైన నీరు అందించొచ్చు. కొత్తగా రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి దోపిడీ చేయాల్సిన అవసరం లేదు” అని కేటీఆర్ అన్నారు.
Also Read : సికింద్రాబాద్ ఆలయ విధ్వంసం.. ముంబై మోటివేషనల్ స్పీకర్ మునవర్‌పై కేసు నమోదు..!