Temple Vandalism : సికింద్రాబాద్ ఆలయ విధ్వంసం.. ముంబై మోటివేషనల్ స్పీకర్ మునవర్‌పై కేసు నమోదు..!
Secunderabad Temple Vandalism : ఆలయంలో విధ్వంసం ఘటనకు సంబంధించి అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మోటివేషనల్ స్పీకర్ మునవర్ జమాతో పాటు మరో ఇద్దరిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Secunderabad Temple Vandalism
Secunderabad Temple Vandalism : సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో విధ్వంసం కేసులో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన నేపథ్యంలో ముంబైకి చెందిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మునవర్ జమాతో పాటు మరో ఇద్దరిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన భావాలు, విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినట్టుగా గుర్తించారు. ఈ కేసులో అబ్దుల్ రషీద్ బషీర్ అహ్మద్, రెజిమెంటల్ బజార్‌లోని మెట్రోపాలిస్ హోటల్ యజమాని, మేనేజర్ రెహ్మాన్‌లపై మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నెలరోజుల పాటు వ్యక్తిత్వ వికాస వర్క్‌షాప్ ముసుగులో హిందువులపై ద్వేషాన్ని రెచ్చగొట్టినట్టుగా పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. హోటల్‌లో జరిగిన వర్క్‌షాప్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన 151 మందిలో సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్ కూడా ఉన్నారు. అక్టోబర్ 14న సల్మాన్ ఆలయంలోకి చొరబడి స్థానిక దేవత విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అయితే, అతన్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించేలోపే చితకబాదారు. ప్రస్తుతం అతడు నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అనుమతి లేకుండానే వర్క్‌షాప్.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు :
మోటివేషనల్ స్పీకర్ మునవర్ జమా మతపరమైన కారణాలపై వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడమే కాకుండా, అల్లర్లకు కారణమయ్యేలా పాల్గొనేవారిని రెచ్చగొట్టినట్టు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ముత్యాలమ్మ ఆలయంలోని దేవత విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేలా సల్మాన్‌ను రెచ్చగొట్టాడు’ అని గోపాలపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎల్ సురేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, జమా వర్క్‌షాప్ నిర్వహించడానికి అనుమతి తీసుకోలేదని, బషీర్, రెహ్మాన్ ఇందుకు జమారకు సాయం చేశారని పోలీసులు తెలిపారు.
ఈ ముగ్గురిపై చర్యలు తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాన్ఫరెన్స్ రికార్డింగ్‌లు, పాల్గొనేవారికి పంపిణీ చేసిన మెటీరియల్, అనేక ఇతర వివరాలను కూడా పరిశీలిస్తున్నామని సీనియర్ సిటీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. హోటల్‌లోని 49 గదుల్లో పాల్గొనే వారందరికీ వసతి కల్పించినట్లు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతుందన్నారు. జమా ఇంగ్లీష్ హౌస్ అకాడమీ స్థాపకుడని పోలీసులు గుర్తించారు.
Read Also : Sheikh Hasina : షేక్ హసీనాను వెంటనే అరెస్ట్ చేయండి.. మాజీ ప్రధానిపై వారెంట్ జారీ చేసిన బంగ్లాదేశ్ కోర్టు!