తెలంగాణలో మద్యం షాపులు అప్పుడే తెరుస్తాం: ఎక్సైజ్ మంత్రి

  • Published By: vamsi ,Published On : April 14, 2020 / 03:24 AM IST
తెలంగాణలో మద్యం షాపులు అప్పుడే తెరుస్తాం: ఎక్సైజ్ మంత్రి

Updated On : April 14, 2020 / 3:24 AM IST

రాష్ట్రంలోనూ.. దేశంలోనూ.. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోనే మందు బాబులకు ఎక్కడా కూడా మందు దొరకని పరిస్థితి. ఇప్పటికే ఎంతోమంది మందు దొరకక పిచ్చోళ్లు అయిపోతున్నారు. దాదాపు 21రోజుల నుంచి మందు  బాబులు మందు దొరకక తిరుగుతుండగా.. తెలంగాణలో మద్యం షాపులను తిరిగి తెరవాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస గౌడ్ వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ ప్రకృతి సిద్ధంగా లభించే తాటికల్లు మినహా అన్ని రకాల మత్తు పదార్థాలపైనా నిషేధం కొనసాగుతుందని, వైన్స్ షాపుల విషయంలో ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదని, మిగిలిన రాష్ట్రాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో పరిశీలించి, ఆపై సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం మేరకు షాపులు ఓపెన్ చేయాలా? వద్దా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.

కల్లు, మద్యం లభించక కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు వైద్యాధికారులు కృషి చేస్తున్నట్లు వివరించారు. మార్చి నాలుగో వారంలో ఓ దశలో రోజుకు 100కు పైగా కేసులు ఎర్రగడ్డ మానసిక వైద్యాలయానికి వచ్చినట్లు చెప్పిన ఆయన, ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య తగ్గినట్లు చెప్పారు.

మద్యం షాపులను తెరిస్తే, అక్కడ జనాలు అధికంగా గుమికూడతారని, ఈ కారణంతోనే షాపులను తెరిచేందుకు అనుమతించలేదని, పరిస్థితి చక్కబడిందని భావిస్తే, షాపులను తెరిచేందుకు అవకాశం ఉంటుదని ఆయన అభిప్రాయపడ్డారు.