Sambhani Chandrasekhar
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం విధితమే. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయాలు అందించా. సుదీర్ఘకాలం పార్టీకోసం కష్టపడి పనిచేశానని సంభాని అన్నారు. పొత్తులను గౌరవిస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచా. కాంగ్రెస్ అంటే ప్రాణంగా, ఇష్టంగా పనిచేశా. కానీ, ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తులకు సీట్లు ఇచ్చారు. కనీసం గౌరవంగా కూడా చూడలేదు అంటూ సంభాని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు సేవ చెయ్యాలనే లక్ష్యంతో రాజకీయాల్లో వచ్చానని, సొంత ఇల్లుకూడా సంపాదించుకోకుండా కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేశానని.. కానీ, కాంగ్రెస్ లో నన్ను అనాధగా చూశారని అన్నారు. బీఆర్ఎస్ నన్ను గౌరవంగా ఆహ్వానించిందని తెలిపారు. పదవులు నాకు అవసరం లేదు.. పార్టీలో నమ్మకంగా పనిచేస్తానని సంభావి తెలిపారు. కాంగ్రెస్ లో డబ్బు, కులాలను చూస్తున్నారు. అగ్రవర్ణాలు పెత్తనం చెలాయిస్తున్నారు.. దళితులను చిన్నచూపు చూస్తున్నారంటూ సంభాని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరినప్పుడు నేను ఆయన్ను ఒక్కటే అడిగా.. సీతారామ ప్రాజెక్టు ను త్వరగా పూర్తి చేయాలని అడిగా. సీతారామ ప్రాజెక్టు వలన పదకొండు లక్షల ఎకరాలకు న్యాయం జరుగుతుందని సంభాని అన్నారు.