Minister KTR : వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే.. ఇంతకు ఇంత అనుభవిస్తారు.. వాళ్లకు కేటీఆర్ సీరియస్ వార్నింగ్

జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గువ్వల బాలరాజుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఈ ఘటనతో అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Minister KTR : వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే.. ఇంతకు ఇంత అనుభవిస్తారు.. వాళ్లకు కేటీఆర్ సీరియస్ వార్నింగ్

Minister KTR

Updated On : November 12, 2023 / 12:37 PM IST

Telangana Assembly Elections 2023: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి జరిగిన విషయం విధితమే. బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వాహనాన్ని వెంబడించారు. అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉధ్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒకరిపైఒకరు దాడికి దిగడంతో గువ్వల బాలరాజుకు గాయాలయ్యాయి. వెంటనే బాలరాజును ప్రథమ చికిత్స నిమిత్తం అచ్చంపేటలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

Also Read : Guvvala Balaraju : బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై రాళ్ల దాడి

జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గువ్వల బాలరాజుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. ఈ ఘటనతో అచ్చంపేటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును మంత్రి కేటీఆర్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో కలిసి బాలరాజు మీద దాడి చేశారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదు.. కాంగ్రెస్ నాయకులు బాలరాజు సతీమణినికూడా అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని ఈ సంస్కృతిని ప్రవేశపెడితే తప్పకుండా అనుభవిస్తారు. మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే ఇంతకు ఇంత అనుభవించి తీరాల్సిందే అంటూ కేటీఆర్ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్పాలని కేటీఆర్ ప్రజలను కోరారు. శాంతి భద్రతలపై డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం.. బాలరాజుకు సెక్యూరిటీ పెంచాలని కోరుతున్నామని కేటీఆర్ అన్నారు.

Also Read : Palvai Sravanthi : బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి.. రేవంత్, రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇదిలాఉంటే.. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులు సహకరిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ కూడలిలో బైఠాయించారు. కారులో డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చినా పోలీసులు అడ్డుకోలేదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గువ్వల బాలరాజుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ ఆరోపించారు. మరోవైపు సీఐ అనుదీప్ ఈ ఘటనపై స్పందించారు. కారులో తీసుకెళ్తుంది ఫొటో కెమెరాలకు సంబంధించిన సంచులేనని పేర్కొన్నారు. విచారణ జరుపుతున్నామని అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.