Basara Ganana Saraswati Temple Prasadam
Basara Ganana Saraswati Temple : బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రసాదం లడ్డూలు పాడయ్యాయని భక్తులు మండిపడుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అమ్మవారి అభిషేకం లడ్డూలకు ఫంగస్ ఏర్పడింది. వేల సంఖ్యలో లడ్డూలు పాడైనట్లుగా తెలుస్తోంది. ఒక్కో అభిషేకం లడ్డూ ధర 100 రూపాయలు. అయితే కొన్ని లడ్డూలను సిబ్బంది వేరు చేసి ఆరబెడుతున్నారు. చాలావరకు లడ్డూలు పడేసే పరిస్థితి ఉంది. ఆలయ సిబ్బంది నిర్వాకం వల్లే లడ్డూలు ఇలా అయ్యాయని భక్తులు ఆరోపిస్తున్నారు.
గతంలో అనేకసార్లు ఇలానే పాడైన ప్రసాదం..
బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రసాదం లడ్డూలు పాడైన ఘటన ఇది తొలిసారి కాదంటున్నారు భక్తులు. గతంలోనూ చాలాసార్లు ఈ విధంగా ప్రసాదం పాడైందని తెలిపారు. ఈ నెల 20వ తేదీన అమ్మవారి మూలానక్షత్రం కావడంతో ఆరోజున భక్తులు పెద్ద సంఖ్యలో బాసరకు తరలివస్తారని భావించిన ఆలయ సిబ్బంది.. ముందస్తుగా భారీ సంఖ్యలో లడ్డూలు తయారు చేశారు. అయితే, వాటిని సరిగా నిల్వ చేయడంలో ఆలయ అధికారులు, సిబ్బంది కొంత విఫలం అయ్యారు. దాంతో లడ్డూలు పాడయ్యాయి. ప్రసాదం లడ్డూలకు ఫంగస్ ఏర్పడింది.
Also Read : స్త్రీ ఏం చేస్తుందనే అహంకారమే అసురుడ్ని అంతమొందించిన కథ దసరా .. చెడుపై మంచి సాధించిన విజమే విజయదశమి
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలకు డిమాండ్..
అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డూ ప్రసాదానికి ఫంగస్ వచ్చి పాడు కావడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని భక్తులు వాపోయారు. ప్రసాదాలు కొని ఇంటికి వెళ్లిన చాలామంది ఫంగస్ వచ్చిందని చెబుతున్నారు. ఈ ఘటనలో బాసర ఆలయ అధికారులు ఉలిక్కిపడ్డారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
కొన్ని లడ్డూలపైన ఉన్న ఫంగస్ ను తొలగించి వాటిని ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, ఫంగస్ ఏర్పడటంతో వేలాది లడ్డూలు పడేసే పరిస్థితి నెలకొంది. దాంతో పెద్ద ఎత్తున నష్టం వాటిలినట్లు అంచనా వేస్తున్నారు. కాగా, భక్తులను రద్దీని దృష్టిలో ఉంచుకుని మాత్రమే లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయాలనే అభిప్రాయం స్థానికులు, భక్త జనం నుంచి వ్యక్తమవుతోంది. ఇక, లడ్డూలు పాడయ్యేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బాసర గ్రామస్తులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : కష్టాలు పోగొట్టి సకల శుభాలనొసగే ‘శ్రీ దుర్గాదేవి’