Dussehra 2023 : స్త్రీ ఏం చేస్తుందనే అహంకారమే అసురుడ్ని అంతమొందించిన కథ దసరా .. చెడుపై మంచి సాధించిన విజమే విజయదశమి
ఇంద్రాది దేవతలు అందరు కలిసి త్రిమూర్తుల సహాయంతో 18 చేతులు కలిగిన ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తికి విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని, శివుదు త్రిశూలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని సమర్పించారు.

mahishasurmardini
Dussehra 2023 mahishasurmardini : స్త్రీ ఏం చేస్తుందనే అహంకారమే అసురుడ్ని అంతమొందించిన కథ విజయదశమి. మహిళ అనే చులకనతో పురుష అహంకారాన్ని ఆదిశక్తితో అంతమొందించిన కథ విజయదశమి కథ. అహంకారంతో అరాచకాలకు పాల్పడిన అసురుడ్ని సంహరించిన కథే దసరా. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు విజయదశమి పండుగ. ఆడది తనను సంహరిస్తుందా..? అనే అహంకారంతో పురుషుని చేతిలో మరణం లేకుండా వరాన్ని పొందిన మహిషాసురుడు ఆదిశక్తి అవతారంతో అందమొందించింది ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. మహిషారుడ్ని అంతమొంచి మహిషాసుర మర్ధినిగా పేరొందింది ఆదిపరాశక్తి.
దేవతలను పట్టి పీడిస్తు .. హింసిస్తు పాతకాలకు పాల్పడే మహిషాసురుడ్ని అంతమొందించినందుకు గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తే ఈ విజయదశమి పండుగ.
ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నాటి నుండి తొమ్మిది రోజులు జరిగే దేవి నవరాత్రి ఉత్సవాలనే దసరా అని పిలుస్తాం. ఈ తొమ్మిది రోజులు దుర్గామాత తొమ్మిది అవతరాల్లో భక్తులను కరుణిస్తుంది. శక్తిని ఇచ్చే అమ్మగా..అన్నపూర్ణాదేవిగా. బాల త్రిపుర సుందరిగా..జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ దేవిగా ఇలా తొమ్మిది అవతారాల్లో అమ్మ భక్తుల పాలిట కొంగుబంగారంగా కరుణిస్తుంటుంది. దసరా నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా అంటారు ఎందుకంటే శరత్ ఋతువులో జరుపుకునే నవరాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు.దసరా అంటే విజయం, విజయం అంటే దసరా. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ దసరా. ఈ దసరా జరుపుకోవటానికి మూడు కారణాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.
Navaratri 2023 : అమ్మవారి చేతుల్లో ఉన్న ఆయుధాలు దేనికి సంకేతమో తెలుసా?
మహిషాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను జయించాలనే దుర్బుద్ధితో బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడ్ని ప్రసన్నం చేసుకున్నాడు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు ఏ వరం కావలో కోరుకోమన్నాడు. దానికి మహిషుడు తనకు ఏ పురుషుడు చేతిలోను మరణం లేకుండా వరం కావాలని కోరుకున్నాడు. దానికి బ్రహ్మ తథాస్తు అన్నాడు. దాంతో మహిషుడికి ఎక్కడలేని అహంకారం పెరిగిపోయింది. అంటే మహిషుడికి ఆడవాళ్లు తననేం చేయగలరు అనే అహంకారం. కానీ ఆ అహమే తనను అంతం చేస్తుందని తెలుసుకోలేకపోయాడు.
బ్రహ్మదేవుడి వరంతో దేవతలను ప్రజలను హింసించేవాడు. ఇంద్రాది దేవతలు త్రిమూర్తుల వద్దకెళ్లి మొరపెట్టుకున్నాడు. మహిషుడు బాధలు భరించలేకపోతున్నామని ఆదుకోమని వేడుకున్నారు. దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తాము మహిషుడ్ని అంతమొందించలేమని అది బ్రహ్మ ఇచ్చిన వరం అని చెప్పారు. కానీ దేవతలు ఇక ఈ అసురుడి చేతిలో మేం హింసలు అనుభవించాల్సిందేనా.? మా బాధలు తీర్చేవారే లేరా..? అంటూ ఆవేదన చెందారు.
దానికి త్రిమూర్తులు దేనికైనా పరిష్కారం ఉంటుంది ఆవేదన చెందవద్దు..మహిషుడు అహంకారమే అతని అంతానికి నాంది అంటూ త్రిమూర్తులు దేవతలను ఊరడించారు. ఇంద్రాది దేవతలకు ఓ ఉపాయం చెప్పారు. స్త్రీ చేతిలోనే మహిషుడి అంతమొందుతాడు అంటూ చెప్పారు. దీంతో ఇంద్రాది దేవతలు అందరు కలిసి త్రిమూర్తుల సహాయంతో 18 చేతులు కలిగిన ఒక స్త్రీ శక్తి రూపాన్ని సృష్టించారు. ఆ శక్తికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని, శివుదు తన త్రిశూలాన్ని, స్వర్గాధిపతి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని సమర్పించారు. అలా ఇంద్రాది దేవతలు తమ తమ ఆయుధాలను శక్తికి సమర్పించారు. అలా 18 చేతులతో మారణాయుధాలను ధరించిన ఆ శక్తే దుర్గామాతగా అవతరించింది. ఈ ఆయుధాలకు తోడు అతి శక్తిగల వాహనంగా సింహాన్ని ఇచ్చారు.
అలా సకల ఆయుధాలతో దుర్గాదేవి మహిషాసురుడితో యుద్ధం ప్రారంభించింది. ఆయుద్ధం తొమ్మిది రోజులు సాగింది. ఆ తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా మారాయి. చివరికి పదవ రోజున మహిషుడుని అమ్మవారు సంహరించింది. యుద్ధం చేసిన తొమ్మిది రోజులు దేవీనవరాత్రులు కాగా పదవ రోజు మహిషుడ్ని సంహరించి దుర్గామాత విజయానికి గుర్తుగా విజయదశమిగా మారింది. దశమి రోజున విజయం సిద్దించింది కాబట్టి విజయదశమిగా జరుపుకుంటారు.
అలాగే రామాయణ ప్రకారం రాముడు రావణాసురుడిని వధించిన రోజు కూడా దశమి రోజునే అని చెబుతారు. మరో కథ ఏమిటంటే మహా భారతంలో పాండవులు తమ వనవాసాన్ని..అజ్ఞాతవాసాన్ని ముగించుకుని తమ ఆయుధాలను జమ్మిచెట్టు పైనుండి తీసుకున్న రోజుగా కూడా చెబుతారు.
ఇలా కథలు ఏవైనా..చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తే ఈ విజయదశమి. ఈరోజు ఏ కార్యక్రమం ప్రారంభించినా జయప్రదమవుతుందని అంటారు. వ్యాపారం ప్రారంభిస్తే చక్కటి లాభాలు చేకూరుతాయని నమ్ముతారు.