హైద‌రాబాద్‌ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్‌.. మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు..! ఇంటివద్దనే ప్రశాంతంగా..

నగరంలోని సిటీ బస్సుల్లో ప్రయాణించే వారికోసం జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్టాప్ లలో బస్సులకోసం ఎదురు చూడకుండా...

City Bus in Hyderabad

City Bus in Hyderabad: హైదరాబాద్ ఉంటూ మీరు సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే మీకు జీహెచ్ఎంసీ తీపికబురు చెప్పింది. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు విద్యార్థులు, మహిళలు, చిరువ్యాపారులు ఇలా అనేక వర్గాలవారు అధిక శాతం మంది సిటీ బస్సులనే ఆశ్రయిస్తుంటారు. అయితే, పలుసార్లు బస్ స్టేషన్ వద్దకు వచ్చిన తరువాత వారువెళ్లే రూట్లలో బస్సుకోసం గంటల కొద్దీ వేచిఉండాల్సిన పరిస్థితి. దీంతో సమయం వృథా అవుతుండటంతోపాటు వెళ్లాల్సిన చోటుకు సరియైన సమయానికి చేరుకోలేక పోతున్నారు. ఫలితంగా చాలా మంది సిటీ బస్సుల కంటే ఇతర వాహనాలను ఆశ్రయిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇకనుంచి వారి ఇబ్బందులను తొలగించేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఫోన్లలో ఆ యాప్ ఉంటే చాలు మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు. ఫోన్ లేకపోయినా పర్వాలేదు.. అలాంటి వారికోసం బస్ స్టేషన్లలోనే బస్సుల వివరాలు ఎప్పటికప్పుడు స్క్రీన్ పై వచ్చేలా ఏర్పాట్లు చేయబోతున్నారు.

Also Read: గ్రూప్-1 రిజల్ట్స్‌కు అడ్డంకులు తొలిగాయ్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే..? గ్రూప్-1తోపాటు గ్రూప్-2, 3 ఫలితాలు కూడా

ఆ యాప్ ప్రత్యేక ఏమిటి?
సిటీ బస్సు ప్రయాణికులకోసం జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్టాప్ లలో బస్సుల కోసం ఎదురు చూడకుండా ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునేలా ఓ యాప్ ను అందుబాటులోకి తేబోతుంది. బస్ ఇన్ఫర్మేషన్ సిస్టం పేరుతో ఓ యాప్ ను రూపొందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు చేస్తోంది. సిటీని స్మార్ట్ గా మార్చే చర్యల్లో భాగంగా మరో రెండుమూడు నెలల్లో ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతుంది. ఫోన్ లేనివారు, ఫోన్ ను తరచూ చూసేందుకు ఇష్టపడని వారు బస్టాప్ ల వద్దకు వచ్చిన తరువాత మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునేందుకు బస్టాప్ లలో స్క్రీన్ లను ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఇందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Telangana Railway: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకోసం కేంద్రం భారీగా నిధులు.. మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

2,800 బస్సులు.. 1,250 బస్టాపుల్లో..
ముందుగా గ్రేటర్ పరిధిలోని 2,800 బస్సుల్లో జీపీఎస్ సిస్టం అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తరువాత స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ తెలియనివారు, ఫోన్ వాడనివారు, అస్తమానం యాప్ ఓపెన్ చేసేందుకు ఇష్టపడని వారికోసం గ్రేటర్ లోని 1,250 బస్టాపుల్లో ప్రయాణికులు ఎక్కాల్సిన బస్సు ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునేందుకు ప్రత్యేక స్క్రీలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయనుంది. బస్టాప్ లలో ఉండే స్క్రీన్లు, యాప్ కి కనెక్ట్ చేస్తారు. ఈ స్క్రీన్లపై బస్సు నెంబర్ తో పాటు ఏ ప్రాంతం నుంచి వస్తోంది.. ఏ ఏరియాలో ఉంది అనే వివరాలు బస్టాప్ లలోని స్క్రీన్లలో డిస్ ప్లే అవుతాయి. తద్వారా బస్సు లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్ లో యాప్ ఉంటే ఇంటి వద్దనుండే బస్సు లైవ్ లొకేషన్ ను తెలుసుకోవచ్చు.

ఇందుకోసం ఆర్టీసీతో కలిసి జీహెచ్ఎంసీ పనిచేయనుంది. మరో నెలరోజుల్లో ఇందుకోసం టెండర్లు ఆహ్వానించనున్నారు. ఆ తరువాత నెలరోజుల్లోనే యాప్ అందుబాటులోకి తేవడం, ఆ తరువాత బస్టాపుల్లో స్పెషల్ స్క్రీన్స్ ఏర్పాటు చేయడం వంటి ఏర్పాట్లుకు అధికారులు శ్రీకారం చుట్టనున్నారు.