Gone Prakash Key Comments
Gone Prakash Key Comments : తెలంగాణ కాంగ్రెస్ లో సీట్ల కేటాయింపుపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే బడుగు, బలహీన వర్గాల నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి సీఎం అభ్యర్థి ఉండాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాల నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించాలని మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ కి గోనె ప్రకాశ్ లేఖ రాశారు.
టికెట్ల కేటాయింపులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ లో పారాచుట్లకు స్థానం కల్పించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని తెలిపారు. సీట్లు అమ్ముకున్నారని తాను అనడం లేదన్నారు. సీట్ల వ్యవహారంలో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపుపై నిజ నిర్ధారణ కమిటీ వేసి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi : టిఫిన్ బండి వద్ద దోసెలు వేసిన రాహుల్ గాంధీ .. జగిత్యాల పర్యటనలో ఆసక్తికర దృశ్యాలు
అనేక సార్లు ఓడిపోయిన తుమ్మలకు కాంగ్రెస్ సీటు ఇస్తుందన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో గెలవలేక పోయారని, కాంగ్రెస్ లో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ కి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ను కుటుంబ పాలన అనే అర్హత లేదన్నారు. బోథ్ లో కాంగ్రెస్ కి డిపాజిట్లు పోతాయని పేర్కొన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. టికెట్ల వ్యవహారంలో అన్యాయం జరిగిందన్నారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే కనుచూపు మేరలో కాంగ్రెస్ కనపడదని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాలకు సీఎం పదవి కేటాయిస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.