Driving
Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఇంతకాలం ముప్పుతిప్పలు పడాల్సి వచ్చేది. ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లయ్ చేసుకోవడం.. పరీక్ష రాయడం.. తీరాచూస్తే ఫెయిల్ అవడం లాంటివి జరుగుతుండేవి. దీంతో ఎక్కువ మంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం మధ్యవర్తులు, దళారులను ఆశ్రయిస్తున్నారు. తద్వారా డ్రైవింగ్ లైసెన్సుకు అర్హత ఉన్నప్పటికీ తమ జేబులకు చిల్లు పెట్టుకుంటున్నారు. అయితే, ఇకనుంచి ఆ ఇబ్బందులు ఉండవ్. వాహన డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నా, కొత్త వెహికిల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా.. ఇక నుంచి ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం వాహన్, సారథి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పోర్టల్ 2016లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్ తో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనుసంధానమై ఆన్ లైన్ విధానంలోనే సేవలు అందిస్తున్నాయి. అయితే, ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ పోర్టల్ లో చేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రం పోర్టల్ లో చేరేందుకు ముందుకొచ్చింది. దీంతో ఇప్పుడు మన రాష్ట్రంలోనూ ఆన్ లైన్ లో రవాణాశాఖకు సంబంధించిన అన్ని పనులను ఇంటి నుంచే చేసుకోవచ్చని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు.
Also Read: ఆర్టీసీ బస్సుల్లో పురుషులకూ ప్రత్యేక సీట్లు.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
కేంద్రం అమలు చేస్తున్న రెండు రకాల పోర్టల్ లో వాహన్ మొదటిది కాగా.. సారథి రెండోది. వాహన్ పోర్టల్ ద్వారా వెహికిల్స్ రిజిస్ట్రేషన్లు, ఇతర ప్రాంతాలకు వాహనాల బదిలీ, యాజమానుల పేరు మార్పు వంటివి ఆన్ లైన్ లోనే చేసుకోవచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లకుండా సంబంధిత షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న సారథి పోర్టల్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ లు ఆన్ లైన్ లోనే పొందొచ్చు. రెన్యువల్ కూడా చేసుకోవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వాహన్, సారథి పోర్టల్ లలో తెలంగాణ రాష్ట్రం అనుసందానం అయింది. మార్చి మొదటి వారం నుంచి ఆన్ లైన్ లో ఈ సేవలు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. మొదట సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తారు. ఆ తరువాత దశలవారీగా అన్ని జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో విస్తరించేందుకు రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వాహన్, సారథి పోర్టల్స్ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ, వాహన రిజిస్ట్రేషన్లలో ఇంతకాలం జరుగుతున్న పలు అవినీతి, అక్రమాలకు చెక్ పడనుంది.