×
Ad

Aadi Srinivas: ఆది శ్రీనివాస్ ప్రోటోకాల్ ఇష్యూలో ట్విస్ట్.. కలెక్టర్‌పై నో యాక్షన్.. డీపీఆర్వోపై వేటు.. ఎందుకలా?

ఇక కలెక్టర్‌పై బదిలీ వేటే మిగిలింది అన్న చర్చ జరుగుతున్న సమయంలోనే సిరిసిల్ల డీపీఆర్వో రంగంలోకి దిగారు. జిల్లా అధికారుల వాట్సప్‌ గ్రూప్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కించపరుస్తూ..

Aadi Srinivas: ఇష్యూ అటు ఇటు తిరిగింది. చివరకు ఓ అధికారి మెడకు చుట్టుకుంది. అసలు సమస్య కలెక్టర్‌తో అయితే..ఓ కార్టూన్ పోస్ట్‌తో డీపీఆర్వోపై వేటు పడింది. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే.. పైగా ప్రభుత్వ విప్..ఆయనకే ప్రోటోకాల్ పాటించడం లేదంటూ గత వారం రోజులుగా పెద్ద రచ్చే జరుగుతోంది. దీనికి బాధ్యుడైన కలెక్టర్‌పై చర్యలుంటాయని అందరూ భావిస్తుంటే…ఇప్పుడా వివాదం డీపీఆర్వో సస్పెండ్‌తో ముగిసిపోయినట్టే కన్పిస్తోంది.

ట్విస్ట్ ఏంటంటే తనను సస్పెండ్ చేశారంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ కాపీని సదరు డీపీఆర్వోనే వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆది శ్రీనివాస్ ప్రోటోకాల్ ఇష్యూ ట్రాక్ తప్పిందా? ఎమ్మెల్యేను కించపరిచినట్లు ఉన్న కార్టూన్‌ను డీపీఆర్వో ఎందుకు పోస్ట్ చేసినట్లు? తనపై బదిలీ వేటు ఖాయమని జరిగిన చర్చకు డీపీఆర్వో సస్పెన్షన్‌తో కలెక్టర్ తనదైన శైలిలో ముగింపు ఇచ్చారా?

రాజన్న సిరిసిల్ల నేతల తీరు..అధికారుల వ్యవహార శైలి సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా మారింది. నిన్న మొన్నటి వరకు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించారు అప్పటి మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేటీఆర్‌కు చెక్ పెట్టేందుకు అప్పట్లో మంచి పోస్టింగ్‌లు ఇవ్వక పక్కన పెట్టిన ఓ ఐఏఎస్‌ను ఏరికోరి సిరిసిల్లలో పోస్టింగ్ ఇచ్చారు అధికార పార్టీ నేతలు. అయితే మొదట్లో కేటీఆర్‌ టార్గెట్‌గానే కలెక్టర్‌ ముందుకు పోతున్నట్టే కన్పించినా..ఇప్పుడది వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు తగులుతోందన్న చర్చ నడుస్తోంది.

కలెక్టర్ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ రచ్చ..

ఆదికి కలెక్టర్ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కొన్నాళ్లుగా రచ్చ నడుస్తుంది. ప్రజాపాలన వేడుకల్లో తనకు ప్రోటోకాల్ కల్పించలేదని వేదిక మీద నుండే కలెక్టర్‌పై ఉన్నతాధికారులకు ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయింది. తర్వాత సీఎస్‌కు కూడా కంప్లైంట్ చేశారు. అంతేకాదు బీసీ నేతను అవమానిస్తున్నారంటూ బీసీ సంఘాల నేతలు నిరసన తెలిపారు. దీంతో కలెక్టర్‌కు షోకాజు నోటీసు కూడా జారీ చేసింది సర్కార్.

ఇక కలెక్టర్‌పై బదిలీ వేటే మిగిలింది అన్న చర్చ జరుగుతున్న సమయంలోనే సిరిసిల్ల డీపీఆర్వో రంగంలోకి దిగారు. జిల్లా అధికారుల వాట్సప్‌ గ్రూప్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కించపరుస్తూ కలెక్టర్‌కు మద్దతుగా ఎవరో గీసిన ఓ కార్టూన్‌ను డీపీఆర్వో పోస్టు చేశారు. ఈ వ్యవహారంపై ఆది శ్రీనివాస్ అనుచరులు, కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డీపీఆర్వో శ్రీధర్‌పై గంటల్లోనే వేటు వేశారు జిల్లా కలెక్టర్ సందీప్‌ కుమార్ ఝా.

తన మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని..సంబంధిత డీపీఆర్వోనే జిల్లా రిపోర్టర్స్ గ్రూప్ లో షేర్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సస్పెన్షన్ మీద హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు సస్పెండ్ అయిన డీపీఆర్వోనే వాట్సప్‌లో షేర్ చేయడమేంటన్న చర్చ జరుగుతోంది.

కలెక్టర్‌ మీద యాక్షన్‌కు బదులు డీపీఆర్వో మీద వేటు..

ప్రభుత్వ విప్ అయిన ఆది శ్రీనివాస్ తనకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకుంటారని అంతా భావిస్తున్న తరుణంలో కలెక్టర్‌ మీద యాక్షన్‌కు బదులు డీపీఆర్వో మీద వేటు పడింది. అది కూడా కలెక్టరే ఉత్తర్వులు జారీ చేయడం ఇంట్రెస్టింగ్ విషయం.

సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో ఆది శ్రీనివాస్‌కు ప్రోటోకాల్ పాటించలేదు జిల్లా అధికారులు. జెండా వందనం ముగింపు దశలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా చివరి నిమిషంలో వచ్చి సెల్యూట్ చేశారు. పైగా జనగణమన గీతం పాడుతున్నప్పుడు..కలెక్టర్ దర్జాగా కారు దిగి స్టేజ్ ఎక్కి సెల్యూట్ చేయడం వివాదాస్పదమైంది.

ముందుగా వచ్చి అతిథులను గౌరవించుకోవాల్సింది పోయి.. ఆయనే అతిథిగా రావడం ఏంటంటూ గుసగుసలాడారు. విప్ ఆది శ్రీనివాస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో..కలెక్టర్ తీరుపై సీఎస్‌కు, ప్రోటోకాల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో ఆది శ్రీనివాస్‌కు మాట్లాడే అవకాశం కల్పించారు. అయితే అధికార పార్టీ నేతలనే కలెక్టర్ ఖాతరు చేయడం లేదంటూ పెద్ద దుమారమే లేచింది.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ విప్ ఆది శ్రీనివాస్‌ను అవమానించారట కలెక్టర్. అతిథిగా వచ్చిన..ఆది శ్రీనివాస్‌ను కలెక్టర్, ఎస్పీ గౌరవంగా ఆహ్వానించడానికి రాలేదట. దీంతో ఆది శ్రీనివాస్ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారట. ఇక తమ బీసీ నాయకుడిని కలెక్టర్ అవమానిస్తున్నారంటూ సిరిసిల్ల జిల్లా బీసీ సంఘాల నేతలు..సీపీకి కంప్లైట్ చేశారు. అయితే ఇప్పుడు కార్టూన్ వివాదంతో డీపీఆర్వో శ్రీధర్ బలి కావాల్సి వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.

ప్రోటోకాల్ వివాదంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝానే జిల్లా నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తారన్న టాక్ వినిపించింది. అందుకు సెక్రటేరియట్‌లో ఫైల్ రెడీ అవుతుందని ప్రచారం నడుస్తున్న టైమ్‌లోనే డీపీఆర్వో ఓ కార్టూన్‌ను వాట్సప్ గ్రూప్‌లో పెట్టడం వివాదాస్పదం అయింది. కట్ చేస్తే ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ ఉత్తర్వుల కాపీని కూడా తనకు అవార్డు వచ్చినట్లు ఆయన వాట్సప్‌లో షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

కాంట్రవర్సీకి కేరాఫ్ డీపీఆర్ వో శ్రీధర్..

అయితే డీపీఆర్వో శ్రీధర్ ఎక్కడ పనిచేసినా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ఉంటారట. గతంలో పెద్దపల్లి జిల్లా డీపీఆర్వోగా పని చేసినప్పుడు సాంస్కృతిక సారధి ఉద్యోగినితో ఫోన్ కన్వర్జేషన్‌లో చిక్కుల్లో పడ్డారట. ఆ తర్వాత జగిత్యాల డీపీఆర్వోగా పని చేసిప్పుడు మీడియా ప్రతినిధులతో గొడవ పెట్టుకున్నారట. ఇక సిరిసిల్లకు వచ్చేసరికి కలెక్టర్‌కు మద్దతుగా ఎమ్మెల్యేను కించపరుస్తూ ఉన్న కార్టూన్‌ను వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేసి సస్పెండ్ అయ్యారు. అయితే సిరిసిల్ల ఎపిసోడ్ వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారింది. కలెక్టర్ మీద వేటు పడాల్సింది పోయి ఇష్యూ డీపీఆర్వో మీదకు మళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. అదికూడా ఇష్యూని డైవర్ట్ చేసేందుకు అధికారులే డ్రామా ఆడుతున్నారా అన్న చర్చ కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో నడుస్తోంది.

Also Read: మంత్రులకే క్లాస్‌లు..? హాట్ టాపిక్‌గా ఐఏఎస్‌ల తీరు.. మినిస్టర్లనే డామినేట్ చేస్తున్న ఆ అధికారులెవరు..