IAS Officers: మంత్రులకే క్లాస్‌లు..? హాట్ టాపిక్‌గా ఐఏఎస్‌ల తీరు.. మినిస్టర్లనే డామినేట్ చేస్తున్న ఆ అధికారులెవరు..
ఒకవేళ ఫస్ట్ టైమ్ మినిస్టర్స్‌గా ఉన్నవాళ్లకు కొన్ని విషయాలు తెలియకపోయినా..అమాత్యులకు బ్యూరోక్రాట్స్ సలహాలు, సూచనలు ఇవ్వడం కామన్.

IAS Officers: అంతా మేమే. అమాత్యులైనంత మాత్రాన వాళ్లు చెప్తే వినాలా..వాళ్లకు ఏం తెలుసు. మా డైరెక్షన్స్ ప్రకారమే వాళ్లు నడుచుకోవాలి. ఇది తెలంగాణలోని కొందరు ఐఏఎస్, ఐపీఎస్ ల తీరు అంటూ..సెక్రటేరియట్ లో గుసగుసలు మొదలయ్యాయి. మంత్రుల ఆదేశాలను బ్యూరోక్రాట్స్ పిచ్చ లైట్ తీసుకుంటున్నారట. పైగా మీకేం తెలుసు అన్నట్లుగా నేరుగా మంత్రులతోనే మాట్లాడుతున్నారట. మంత్రులకే సలహాల మాదిరిగా క్లాసులు పీకుతున్నారట కొందరు అధికారులు. ఇంతకు ఎవరా ఐఏఎస్‌లు? ఐఏఎస్‌ల తీరుతో అవాక్కవుతున్న అమాత్యులెవరు..?
మంత్రి అంటే. సీఎం తర్వాత ప్రభుత్వంలో కీలక ర్యాంకున్న నేత. రెండు మూడు శాఖలు మంత్రి పరిధిలోనే ఉంటాయి. మంత్రులుగా వాళ్లకు కొత్త అయినా, పాత వాళ్లు అయినా ఆయా శాఖలకు వారే బాసులు. వారి నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత బ్యూరోక్రాట్స్ ది. ఓఎస్డీలు, పీఎస్‌లు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ..అమాత్యుల ఆర్డర్స్ ప్రకారం నడుచుకోవాల్సిందే. ఎక్కడైనా ఇదే జరుగుతుంటుంది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారట. అసలు మంత్రులకు ఏమీ తెలియదు.. వాళ్లు చెప్పినట్లు తాము పని చేసేది ఏంటన్నట్లు బిహేవ్ చేస్తున్నారట. ఒకవేళ ఫస్ట్ టైమ్ మినిస్టర్స్‌గా ఉన్నవాళ్లకు కొన్ని విషయాలు తెలియకపోయినా..అమాత్యులకు బ్యూరోక్రాట్స్ సలహాలు, సూచనలు ఇవ్వడం కామన్. వారికి అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా సెక్రటరీలదే.
కానీ ఈ మధ్య కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే కం మంత్రికి చేదు అనుభవం ఎదురైందట. మంత్రి ఫోన్ చేసిన సందర్భంలో ఓ సీనియర్ ఐఏఎస్ ఫోన్‌లో మాట్లాడిన తీరు ఆ మంత్రి పేషీలో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి అనే హోదాను గౌరవించకుండా, ఆ ఐఏఎస్ ఇష్టానుసారంగా మాట్లాడటంతో మంత్రి ఇబ్బంది పడ్డారని..ఆ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రజా సమస్యే కదాని అందరి ముందు స్పీకర్ ఫోన్‌లో మాట్లాడటమే ఆ అమాత్యుని పరువు పోయేలా చేసిందనే టాక్ నడుస్తోంది.
ఇలా పదే పదే ఫోన్ చేస్తే ఎలా? నేను పని చేసుకోవద్దా?
ఓ కొత్త మంత్రి శాఖకు చెందిన ఫైల్స్ ఆ శాఖ సెక్రటరీ దగ్గర చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వెంటనే క్లియర్ చేయాలని చెప్పేందుకు సంబంధిత సెక్రటరీకి మంత్రి ఫోన్ చేశారు. సెక్రటరీ గారు..వెంటనే ఆ ఫైల్స్ క్లియర్ చేసి పంపండి ప్లీజ్ అని గౌరవంగానే కోరారట ఆ మంత్రి గారు. కానీ సెక్రటరీ మాత్రం మంత్రి అనే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఎడపెడా వాగేశారట. ఏంటీ..మీరు ఎప్పుడు పడితే అప్పుడే ఫోన్ చేస్తారా? ఇలా పదే పదే ఫోన్ చేస్తే ఎలా? నేను పని చేసుకోవద్దా? ఎప్పుడు ఏ ఫైల్ క్లియర్ చేయాలో మాకు తెలుసు అంటూ నోరుపారేసుకున్నారట సదరు అధికారి.
కానీ మంత్రి మాత్రం తన సహజ ధోరణిలో సరే సార్. కాస్త త్వరగా క్లియర్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేసి ఫోన్ పెట్టేశారట. అయితే ఈ ఫోన్ సంభాషణ సమయంలో ఆ మంత్రి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉండటం ఫలితంగా తన అనుచరుల దగ్గర ఆయన ఇబ్బంది పడాల్సి వచ్చిందని చర్చ జరుగుతోంది. పలువురు ఐఏఎస్‌లు ఇలానే దురుసుగా వ్యవహరిస్తూ..మంత్రులకు ఇబ్బందికరంగా మారుతున్నారట.
మంత్రి పంపించే ఫైల్స్‌ను పక్కన పడేస్తున్న అధికారి!
ఇక ఇంకో సీనియర్ మంత్రి సూచించినా, ఆదేశించినా ఆయన శాఖలో పనిచేసే సీనియర్ ఐఏఎస్ అధికారి కూడా ఫైళ్లనూ.. పనులనూ పెడ చెవిన పెడుతున్నారట. ఆ మంత్రి ఇచ్చిన మౌఖిక ఆదేశాలను అసలే పట్టించుకోవడం లేదట. చివరకు తన దగ్గరకు వచ్చే ఫైల్స్‌ను పరిశీలించాలని ఎండార్స్ చేసి పంపినా పక్కన పడేస్తున్నారట సదరు అధికారి. అంతేకాదు మంత్రి చెప్పిన ఫైల్‌కు వీలైనన్ని కొర్రీలు పెడుతూ అటూ ఇటూ తిప్పుతున్నారన్న చర్చ సాగుతోంది.
గతంలో అనేక ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసినా..ఇలాంటి అధికారిని మాత్రం చూడలేదని గొణుక్కుంటున్నారట సదరు అమాత్యులు. ఇక ఓ మహిళా మంత్రికి కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయట. ఆ మంత్రి ఇచ్చిన ఆదేశాలను మహిళా సాధికారత కోసం పనిచేసే ఓ ఐఏఎస్ అధికారిణి ఏ మాత్రం పట్టించుకోవడం లేదట. దీంతో సదరు మహిళా మంత్రి ఆ ఐఏఎస్ అధికారిణికి పనులు చెప్పాలంటేనే ఆలోచిస్తున్నారట. ఇలా ముగ్గురు మంత్రులే కాదు..పలువురు మినిస్టర్లు కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారట. తమ శాఖల ఉన్నతాధికారుల తీరును ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
Also Read: ఆది శ్రీనివాస్ ప్రోటోకాల్ ఇష్యూలో ట్విస్ట్.. కలెక్టర్‌పై నో యాక్షన్.. డీపీఆర్వోపై వేటు.. ఎందుకలా?